Begin typing your search above and press return to search.

రద్దు మీద మీరే ఇలా మాట్లాడితే ఎలా బాబు?

By:  Tupaki Desk   |   19 Nov 2016 4:30 AM GMT
రద్దు మీద మీరే ఇలా మాట్లాడితే ఎలా బాబు?
X
పెద్దనోట్లను రద్దు చేయాలన్న డిమాండ్ ను తానే తెర మీదకు తెచ్చినట్లుగా.. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలంటూ ప్రధానిని పదే పదే కోరటం.. లేఖలు రాయటం లాంటివి చేశానని..మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన ప్రయత్నం ఉందని చెప్పుకుంటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. నోట్ల రద్దు గురించి పదే పదే మాట్లాడిన ఆయన.. నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే వేళ.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రద్దుతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది? లాంటి విషయాల గురించి చెప్పింది లేదు.

రద్దు చేయాలని చెప్పే చంద్రబాబు.. రద్దు చేసిన పక్షంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించింది లేదు. అలాంటి ఆయన మోడీ తీసుకున్న రద్దు నిర్ణయంపై.. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఈ మధ్యన ప్రస్తావిస్తున్నారు. నోట్ల రద్దును స్వాగతిస్తూనే.. ప్రజల కష్టాలపై దృష్టి సారించాలని ఆయన కేంద్రాన్ని.. రిజర్వ్ బ్యాంక్ ను కోరుతున్నారు.

రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఒక్కమాటలో అర్థమయ్యేలా చంద్రబాబు చెప్పినట్లుగా ఎవరూ చెప్పలేదనే చెప్పాలి. లిఫ్ట్ లో ఒంటరిగా ఇరుక్కుపోయి.. చేతిలో సెల్ ఫోన్ కూడా లేకుండా ఉంటే ఎంత ఆందోళనకు గురి అవుతామో అలాంటి పరిస్థితినే ఇప్పుడు సామాన్యులు పడుతున్నట్లుగా చెప్పిన ముఖ్యమంత్రి.. దేశంలో నల్లధనం ఒక్కశాతం మంది దగ్గరే ఉందని.. కానీ ఇప్పుడు రెక్కాడితే డొక్కాడని పేదలూ ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించటం గమనార్హం. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అన్న ఒక్క మాటతో సరిపోదని.. దాంతో చాలానే అంశాలు ఉంటాయన్న విషయాన్ని చంద్రబాబు ఆలోచించలేదా? పెద్దనోట్ల రద్దు అంటే చంద్రబాబు ఎలా అనుకున్నారు? లాంటి సందేహాలు ఆయన వేస్తున్నప్రశ్నల్ని వింటే కలుగక మానదు.

పెద్దనోట్ల రద్దును మరే ముఖ్యమంత్రి అడగకున్నా.. చంద్రబాబు మాత్రం అదే పనిగా.. అలాంటి నిర్ణయం తీసుకోవాలని కోరుకున్నారు. అలాంటి ఆయన కేంద్రం తాజాగా విడుదల చేసిన రూ.2వేల నోటు మీద తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రూ.2వేల నోటు రావటం వల్ల ఇప్పుడున్న కరెన్సీ కొరత ఎంతోకొంత తగ్గుతున్న పరిస్థితి. ఒకవేళ.. రూ.2వేల నోటు కూడా లేకుండా పరిస్థితి ఎలా ఉండేదన్న ఊహే భయం కలిగించేలా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరి అలాంటివి చంద్రబాబు ఆలోచించరా? అన్నది పెద్ద ప్రశ్న. ఓపక్క పెద్దనోట్లను రద్దు చేయాలని చెబుతూనే.. నోట్ల రద్దు కారణంగా సామాన్యులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఏకరవు పెడుతున్న ఆయన.. అదే సమయంలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు సామాన్యుల్ని పావులుగా వినియోగించుకుంటున్న వైనాన్ని బాబు ఎందుకు గుర్తించరు? అన్నది పెద్ద ప్రశ్న. సమస్య.. ఇబ్బంది రెండూ బాబే చెప్పటం ఈ ఎపిసోడ్ లో అన్నింటికంటే పెద్ద కొసమెరుపు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/