Begin typing your search above and press return to search.

జేసీ వివాదం లైట్‌..ఎన్నిక‌ల్లో మాదే ఏక‌ప‌క్షం

By:  Tupaki Desk   |   22 Sep 2017 3:58 PM GMT
జేసీ వివాదం లైట్‌..ఎన్నిక‌ల్లో మాదే ఏక‌ప‌క్షం
X
త‌న ప‌రిపాల‌న తీరు, తెలుగుదేశం పార్టీకి భ‌విష్య‌త్ టీడీపీ ర‌థ‌సార‌థి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భారీ భ‌రోసాతో ఉన్నారు. భ‌విష్య‌త్ ఎన్నిక‌ల్లో త‌మ గెలుపు ఖాయమ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రెండ్రోజుల పాటు సాగిన క‌లెక్ట‌ర్ల స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. కలెక్టర్ల సదస్సు సంతృప్తికరంగా జరిగిందని అన్నారు. విభజన తర్వాత ఏపీ ఐఏఎస్‌ అధికారుల టీమ్‌ను బీ టీమ్‌గా ఎగతాళి చేశార‌ని అయితే.... బీ టీమ్‌ను బెస్ట్‌ టీమ్‌ గా మార్చుకున్నామన్నారు. మరో 5 6 సమావేశాలకు పరిపక్వత వస్తుందన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం ద్వారా పార్టీ నేతలు 20లక్షల ఇళ్లకు వెళ్లారని, ప్రజలకు దగ్గరయ్యేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. ఏపీలో మళ్లి రెండోసారి అధికారంలోకి వస్తామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఇదే ఫ‌లితాలు భ‌విష్య‌త్‌ లోనూ పున‌రావృత్తం అవుతాయ‌ని బాబు జోస్యం చెప్పారు. మంచి పనులు చేస్తే ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నానని ఆయన అన్నారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల ముందుకెళ్తామన్నారు.

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిది పెద్ద విషయం కాదని సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఏదైనా విషయం ఉంటే చెప్పి పరిష్కరించుకోవాలని, పద్దతి ప్రకారం వెళ్లాలని బాబు కోరారు. అందరికీ నీళ్లు కావాలి, ప్రాధాన్యతను చెప్పి చేయించుకోవాలని సూచించారు. అనంతపురం వెళ్లినప్పుడు నీటి సమస్యను జేసీ ప్రభాకర్‌ రెడ్డి తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. సమస్యను పరిష్కరించాలని అప్పుడే అధికారులకు ఆదేశాలిచ్చానన్నారు. పులివెందుకు నీళ్లిస్తుంటే అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. సొంత ప్రాంతానికి నీరిస్తుంటే ఎవరైనా అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ఈ సంద‌ర్భంగా తెలుగు రాష్ర్టాల మ‌ధ్య ఉన్న నీటి వివాదాన్ని సైతం సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. తెలంగాణ నీటిని దొంగలిస్తున్నామని కొన్ని పత్రికలు రాస్తున్నాయని పేర్కొంటూ ఆ రాతలు ఎంతో బాధ కలిగిస్తున్నాయని బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా భ‌విష్య‌త్ రాజ‌కీయంపై సీఎం చంద్రబాబునాయుడు విశ్లేషించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే సీమలో రాజకీయం మారిపోతుందని అన్నారు. రాయలసీమలో ఏకపక్ష ఫలితాలు రానున్నాయన్నారు. సీమ‌లో ప్రాజెక్టులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఉద్ఘాటించారు. అభివృద్ధిలో రాజకీయాలు లేవని, అందరికీ పథకాలు అందజేస్తామన్నారు. పేదల కోసం సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.