Begin typing your search above and press return to search.

జూనియర్ సబ్జెక్ట్; టాపిక్ ఈజ్ ఓవర్

By:  Tupaki Desk   |   27 Oct 2015 10:30 PM GMT
జూనియర్ సబ్జెక్ట్; టాపిక్ ఈజ్ ఓవర్
X
కాలం చెల్లిన అంశాలు కొన్ని ఉంటాయి. వాటి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు అలాంటి చర్చే ఒకటి తాజాగా మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబుకు దగ్గర చేసే కార్యక్రమం ఒకటి మొదలైందని. తర్కంగా చూసినా ఈ మాట చాలా కామెడీగా అనిపించక మానదు. విపక్షంలో ఉండి.. అధికారం కోసం తపిస్తూ.. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేని సమయంలోనే దగ్గరకు రానివ్వని టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రిగా.. బలమైన నేతగా అవతరించిన వేళ.. జూనియర్ ను దగ్గరకు తీయాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే.. దగ్గరకు తెచ్చే ప్రయత్నాల్ని కూడా బాబు ఇష్టపడే అవకాశం లేదు.

కొడుకును గ్రాండ్ గా లాంచ్ చేసుకోవటం.. తన వారసుడిగా చినబాబు లోకేశ్ ను తయారు చేయాలన్నదే బాబు భవిష్యత్తు ప్రణాళిక. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అలాంటప్పుడు జూనియర్ లాంటి ప్రజాదరణ కలిగిన మాటగాడ్ని తెచ్చి పార్టీలో పెట్టుకొని.. పెద్దోడ్ని చేస్తే ఇబ్బంది ఎంతన్నది బాబుకు తెలియంది కాదు. 2009 ఎన్నికల సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో జూనియర్ కు ఓకే చెప్పి ఆధారపడిన దానికి ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందో బాబు మర్చిపోయే ఛాన్స్ లేదు.

పవర్ లేని సమయంలో.. పార్టీలో మరో పవర్ పాయింట్ అన్న మాట రాకుండా చేసేందుకు బాబు ఆచితూచి అడుగులేసింది తెలిసిందే. జూనియర్ ను కట్ చేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న బాబు.. ఇప్పుడు కలుపుకోవటానికి ఇష్టపడే ఛాన్సే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ను దగ్గరకు తీసి.. పార్టీలోకి తేవటంతో పని అయిపోదు. ఆ తర్వాత ఎన్నో పంచాయితీలు తీర్చాల్సి ఉంటుందన్న విషయం బాబుకు తెలియంది కాదు. అందుకే.. ఎన్నికల ముందే దూరం పెట్టిన జూనియర్ ను ఇప్పుడు కలుపుకోవాల్సిన అవసరం బాబుకు లేదని తేల్చి చెప్పేటోళ్లు చాలామందే కనిపిస్తారు.

ఇక.. బాబుకు జూనియర్ ను దగ్గర చేసేందుకు అన్న కల్యాణ్ రాం ప్రయత్నాలు చేస్తున్నాడనే వాదన తెరపైకి రావటాన్ని చాలా సింఫుల్ గా తమ్ముళ్లు కొట్టేస్తున్నారు. ఈ అంశంపై ఒక సీనియర్ టీడీపీ నేత స్పందిస్తూ..‘‘హరికృష్ణనే బాబు దగ్గరకు తీయటం లేదు. అంటీ అంటనట్లున్నారు. అలాంటిది.. ఆయన కొడుక్కి పంచాయితీలు కొలిక్కి తెచ్చేంత సీన్ ఇస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఇష్యూను టేకప్ చేసి చంద్రబాబు దగ్గరకు తీసుకెళితే.. బాబు దాకా ఎందుకు చినబాబే చిరాకు పడిపోతారు. అగ్రహం వ్యక్తం చేస్తారు. ఆ విషయాలు కల్యాణ్ రాంకు తెలియని కావు. అయినా.. కల్యాణ్ రాంకు చంద్రబాబు ఎంత అవకాశం ఇస్తారో తెలీదా?’’ అంటూ ప్రశ్నలతోనే తన సమాధానాన్ని చెప్పేశారు.