Begin typing your search above and press return to search.

అమెరికాలో దాడులు...బాబు విశ్లేష‌ణ ఇది

By:  Tupaki Desk   |   28 Feb 2017 1:39 PM GMT
అమెరికాలో దాడులు...బాబు విశ్లేష‌ణ ఇది
X
అమెరికాలో భారతీయులు, తెలుగువారిపై జరుగుతున్న దాడుల గురించి ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేశారు. అగ్ర‌రాజ్యంలో పెద్ద ఎత్తున ఉన్న మ‌న తెలుగువారిపై దాడులు చూస్తుంటే బాధ కలుగుతుందని చంద్ర‌బాబు పేర్కొన్నారు. మన తెలివిని చూసి అసూయ పడే అమెరికాలో దాడులకు తెగబడుతున్నారని చంద్ర‌బాబు విశ్లేషించారు. ఇలాంటి జాత్యహంకార దాడులు స‌రికాద‌ని, వీటిని అమెరికా నియంత్రణ చేయాలని చంద్రబాబు కోరారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం 40వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.

నవ్యాంధ్రప్ర‌దేశ్‌ తొలి ముఖ్య మంత్రిగా ప్రజలు తనకు అవకాశం ఇచ్చారని, ఆదర్శ రాష్ట్రంగా రూపుదిద్దడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తాన‌ని చంద్ర‌బాబు అన్నారు. సంపాదన సమాజం కోసం సృష్టిస్తామని దీని ద్వారా ఎవరైతే కష్టాలలో ఉంటారో వారిని ఆదుకోవచ్చని తెలిపారు. అందుకే సంక్షేమంలో తాను రాజీ పడటం లేదని చంద్రబాబు చెప్పారు. తాను రాత్రింబవళ్లు కష్టపడేది తన కోసం కాదని, బావితరాల భవిష్యత్‌ కోసమని చంద్రబాబు సూత్రీక‌రించారు. ఇలాంటి సమయంలో కొంత మంది దుర్మార్గులు రోడ్లపైకి వచ్చి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతారని ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పరోక్షంగా చంద్ర‌బాబు విమర్శించారు. గంట కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తుంటే రాష్ట్రాన్ని నష్టపరిచేవిధంగా కొన్ని శక్తులు ప్రయత్నించాయని, ఇప్పుడు కూడా ఆదే పనిలో ఉన్నారని వాపోయారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్ధికి తాను ఎంతో కృషి చేస్తున్నాన‌ని చంద్ర‌బాబు విశ్లేషించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రం ప్ర‌భుత్వంపై ఒత్తిడి చేయడం లేదని చెబుతున్నారని, ఒత్తిడి చేయడంలో తనకన్నా ఎవరు మించినవారు లేరని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆనాడు తాను చేసిన ఒత్తిడి ఫలితంగానే పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌రిధిలో ఉన్న ఏడు ముంపు మండలాలను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అవసరమైతే ఒత్తిడి చేయడానికి వెనకడగు వేసేది లేదని బాబు చెప్పారు. అయితే సాధ్యమైనంత వరకు మైత్రితోనే కావాల్సినవి సాధించుకోవాలనే ఉద్దేశంతో తాను ముందుకు పోతున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/