Begin typing your search above and press return to search.

ఇచ్చిన మాట త‌ప్పేది లేదంటున్న బాబు

By:  Tupaki Desk   |   30 Dec 2016 6:50 AM GMT
ఇచ్చిన మాట త‌ప్పేది లేదంటున్న బాబు
X
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తను ఇచ్చిన మాటకు ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండే మనిషినని మరోమారు చెప్పుకొచ్చారు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల అంశాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. అయితే వారికి ఆ అవకాశం ఇవ్వనని... ఇతర బీసీ కులాలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

కాపు రిజర్వేషన్ల విషయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు కట్టుబడి ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అంశంలో కాపులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. కాగా చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో సభకు హాజరైన బుడగ జంగాలు రెండు చేతులూ జోడించి తమను ఎస్సీల్లో చేర్చాలని నినాదాలు చేశారు. దీనిపై బాబు స్పందిస్తూ బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చేందుకు ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. దీనిపై ఆందోళన చెందనవసరంలేదని చెప్పడంతో వారు శాంతించారు. మోరి గ్రామంలో డిజిటల్ లావాదేవీలు ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... కొత్త సంవత్సరంలో కొత్తమార్పుకు నాంది పలకాలని, మార్పు లేనిదే అభివృద్ధిలేదని వ్యాఖ్యానించారు. ఫిజికల్ కరెన్సీ నుంచి డిజిటల్ కరెన్సీకి - మొబైల్ కరెన్సీకి దేశం మారుతోందని, ఈ మార్పును అందరూ అందిపచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఢిల్లీలో బుధవారం జరిగిన డిజిటల్ కరెన్సీపై ఉప సంఘం సమావేశం వివరాలను తెలియజేశారు. కనిష్ట నగదుతో గరిష్ట లావాదేవీలు జరగాలని, ఆధార్ చెల్లింపులు - ఫ్యూచర్ ఫోన్ - కార్డు స్వైపింగ్ - కనీస నగదు వినియోగమే తక్షణ పరిష్కారంగా ఉప సంఘం అభిప్రాయపడిందన్నారు. త్వరలోనే మధ్యంతర నివేదికను ప్రధానికి అందజేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. భౌతిక నగదుకన్నా డిజిటల్ కరెన్సీ ద్వారానే పారదర్శకత వస్తుందని, అవినీతి తగ్గుతుందని, ఉపాధి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే వారికి మరింతగా ప్రోత్సాహకాలు పెరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/