Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం: ప్రచారం వద్దంటున్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   18 July 2016 5:32 AM GMT
ఫస్ట్ టైం: ప్రచారం వద్దంటున్న చంద్రబాబు
X
చంద్రబాబు అంటే ప్రచారానికి మారు పేరు.. చేసింది చిన్నపనైనా - పెద్ద పనైనా నలుగురికీ తెలియాలనేది ఆయన ఉద్దేశం. అంతేకాదు... ప్రతిదీ ప్రొజెక్టు చేసుకోవడంలో ఆయన దిట్ట. కానీ.. తొలిసారి ఓ భారీ కార్యక్రమాన్ని సైలెంటుగా జరిపించేస్తున్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్వహించబోతున్న భారీ కార్యక్రమంపై హడావుడి చేయడం మానేశారు. అవును.. కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం ప్రచారం చేయడం లేదు. ఇందుకు కారణాలూ కనిపిస్తున్నాయి. గోదావరి పుష్కరాల నాటి ఘటనల భయం ఇంకా వెన్నాడుతుండడంతోనే ఈసారి కృష్ణా పుష్కరాలకు హడావుడి తగ్గించినట్లుగా తెలుస్తోంది. మరో 25 రోజుల్లో కృష్ణానది పుష్కరాలు ప్రారంభం కానున్నప్పటికీ ప్రచారం మాత్రం చేయడం లేదు. గోదావరి పుష్కరాలకు రెండు నెలల ముందు నుంచే ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించింది. ఈ ప్రచారం వల్లనే కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు కోట్ల సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వం పుష్కరాలకు ఏర్పాట్లను కూడా భారీయెత్తునే చేసినా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.

కృష్ణా పుష్కరాల విషయానికొస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ ఒక్క ఘాట్ కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే వెంట పడుతున్నా పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. పుష్కర పనులకు వర్షం అప్పుడప్పుడు అడ్డు తగలడం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. పుష్కరాల నాటికి పనులు పూర్తవడం మాట అటుంచితే, చేసిన ఏర్పాట్లు భక్తులకు ఏ మేరకు అందుబాటులో ఉంటాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అమరాతిని రాజధానిగా ప్రకటించిన తరువాత జరుగుతున్న తొలి పుష్కరాలు కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో జరుగుతున్న ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కానీ అధికారుల్లో సమన్వయ లోపం - నిర్మాణ సంస్థలు లక్ష్యాలకు తగ్గట్టుగా పనిచేయకపోవడం వంటి అనేక సమస్యలు ప్రభుత్వానికి శాపంగా పరిణమించాయి. దీంతోపాటు దుర్గ గుడి సుందరీకరణ పనులను కూడా ఆదరాబాదరా ప్రారంభించడం వల్ల కూడా భక్తులు అసౌకర్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పుష్కర ఏర్పాట్లు సక్రమంగా లేవన్న విషయం ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా ప్రచారం కావటంతో భక్తులు కూడా పుష్కరాలకు వచ్చేందుకు సందేహిస్తున్నారు.

మరోవైపు పుష్కర పనులు ఎప్పటికి ఒక కొలిక్కి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే ప్రభుత్వం పెద్దగా ప్రచారం ఇవ్వడం లేదని భావిస్తున్నారు. ఒకవేళ అంచనాలకు మించి జనం వస్తే ఎలా నియంత్రించగలం? వారికి అదనపు సౌకర్యాలు కల్పించగలమా? విజయవాడ నగరం భారీగా తరలివచ్చే భక్తులను తట్టుకోగలదా? వీటన్నింటినీ గమనించకుండా ప్రచారం జోలికెళితే గోదావరి పుష్కరాల్లో ఎదురైన చేదు అనుభవాలే పునరావృతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆ కారణంగానే వచ్చినంత మంది రానీలే అనుకుంటూ ప్రచారం చేయడం మానేసింది.