Begin typing your search above and press return to search.

చంద్రబాబు పొరపాటు..లోకేశ్ కు గ్రహపాటు - 2

By:  Tupaki Desk   |   16 Feb 2016 5:29 PM GMT
చంద్రబాబు పొరపాటు..లోకేశ్ కు గ్రహపాటు - 2
X
లోకేశ్ వంటి ఉన్నత విద్యావంతుడు, పార్టీ కేడర్ లో క్రేజ్ ఉన్న వ్యక్తి నేతగా ఎదగడానికి అన్ని అవకాశాలున్నాయి. రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగాలంటే ప్రజల్లోకి వెళ్లాలి. తెర వెనుక మంత్రాంగాలకే అలవాటు పడిపోతే ప్రత్యక్ష రాజకీయాలంటే భయపడే స్థితి కూడా వస్తుంది. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా ఆయన కూడా తండ్రిపై ఒత్తిడి చేయగలగాలి. తెలంగాణలో కేటీఆర్ తండ్రి అండతో పాటు వ్యక్తిగతంగానూ ఎదుగుతున్నట్లే లోకేశ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజి సాధించుకోవాలి. లేదంటే రాజకీయాల్లో ఆయన రాణించడం కష్టం. ఇదంతా జరగాలంటే లోకేశ్ ఎన్నికల్లో పోటీ అయినా చేయాలి.. లేదంటే పెద్దల సభల నుంచి మంత్రి పదవులైనా అందుకోవాలి.

నిజానికి చంద్రబాబుకూ లోకేశ్ కు పదవి ఇవ్వాలని ఉంది. అయితే.. ఎవరు విమర్శిస్తారో అన్న భయం ఆయన్ను వెంటాడుతోంది. అలా అని లోకేశ్ కు పదవి ఇవ్వనంత మాత్రాన చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు ఆగిపోయాయా అంటే అదీ లేదు. లోకేశ్ ఏ పదవీ లేకుండానే ప్రభుత్వంలో వేలు పెడుతుండడంతో ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. అలాంటప్పుడు ఏ విమర్శలు అయితే రాకూడదని చంద్రబాబు అనుకుంటున్నారో... అవి తప్పనప్పడు ఇంకా పదవి ఇవ్వకుండా ఆగడం ఎందుకో అర్థం కావడం లేదని లోకేశ్ బ్యాచ్ అంటోంది.

మరోవైపు లోకేశ్ కు పదవి ఇవ్వడం ఎంతైనా పార్టీకి ప్రయోజనకరమే. ఇప్పటికే ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు లోకేశ్. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఉంది కాబట్టి అక్కడ లోకేశ్ కు స్థానం కల్పిస్తే ఆయన ఏపీ, తెలంగాణల్లో ప్రభుత్వాలతో అధికారికంగానే భేటీ కావొచ్చు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ఆటంకాలు తొలగుతాయి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధితో సంబంధమున్న శాఖలకు సహాయమంత్రిగా ఉన్నా కూడా ఇక్కడి పార్టీలు నేతలు ఆయన్ను కలవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో ఆయన కీలకంగా మారే అవకాశముంటుంది. విపక్ష నేతగా రాజకీయాల్లో గట్టిపడుతున్న జగన్ ను ఢీకొట్టాలన్నా.... మంత్రిగా పట్టు సాధిస్తున్న కేటీఆర్ తో పోటీ పడాలన్నా కూడా లోకేశ్ కు మంత్రి పదవి వంటిది అత్యవసరం. చంద్రబాబు దాన్ని గుర్తించి ఆ అవకాశం కల్పించకపోతే వచ్చే ఎన్నికల నాటికి లోకేశ్ రాహుల్ గాంధీలా ముద్దపప్పులా మిగిలిపోవాల్సిందే. కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా జాగ్రత్తపడి ఈ 'బొమ్మరిల్లు' కథకు పుల్ స్టాప్ పెడతారో లేదో చూడాలి.