Begin typing your search above and press return to search.

శిల్పా చేసిన పనితో ఇరుకునపడ్డ చంద్రబాబు

By:  Tupaki Desk   |   6 Sep 2017 4:13 AM GMT
శిల్పా చేసిన పనితో ఇరుకునపడ్డ చంద్రబాబు
X
ఎన్ని విభేదాలున్నా కూడా ఏదో రకంగా నంద్యాల ఉప ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్నికలు ముగియగానే మరో కొత్త తలనొప్పి మొదలైంది. నంద్యాల ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన శిల్పా మోహనరెడ్డి సోదరుడైన చక్రపాణి రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తూవెళ్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో చంద్రబాబు కొత్త సమస్య ఎదురైంది. శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు టీడీపీ నుంచి తీవ్రమైన పోటీ ఏర్పడి అది చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతోంది.

స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ అయిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన వైసీపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖాళీయైన ఈ స్థానంలో టీడీపీ నేత‌ల మ‌ధ్య పోటీ నెల‌కొంది. మంత్రి కేఈ కృష్ణమూర్తి త‌మ్ముడు కేఈ ప్ర‌భాక‌ర్ ఈ సీటుకోసం పట్టుపడుతున్నారు. మ‌రోవైపు నంద్యాల ఎన్నిక టైమ్‌ లో ఎమ్మెల్సీ సీటు ఇస్తామ‌ని అటు ఫ‌రూఖ్‌ కు - ఇటు ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు ఆశ చూపారు. అయితే ఎన్నిక‌ల‌కు ముందే ఫ‌రూఖ్ కు గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పుడు మిగిలింది ఏవీ సుబ్బారెడ్డి . దీంతో ఆయన చంద్రబాబుకు పాత హామీని గుర్తుచేస్తున్నారు. మంత్రి సోమిరెడ్డి ద్వారా ఆయన చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారట.

వీరిద్దరు చాలరన్నట్లు చంద్రబాబుకు మరోవైపు నుంచి కూడా ఒత్తిడి మొదలైంది. రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో హడావుడి చేసి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి కూడా అదే ఎమ్మెల్సీ సీటుపై కన్నేశారు. తనను ఎమ్మెల్సీ చేస్తానంటే టీడీపీలోకి వస్తానంటూ ఆయన బేరాలాడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీలోకి వెళ్తూవెళ్తూ చక్రపాణి రెడ్డి చంద్రబాబుకు బాగానే ఫిటింగ్ పెట్టారు.