Begin typing your search above and press return to search.

అలా చేయకుంటే లోకేశ్ మరో రాహుల్ అవుతారా?

By:  Tupaki Desk   |   5 April 2016 6:12 AM GMT
అలా చేయకుంటే లోకేశ్ మరో రాహుల్ అవుతారా?
X
అప్పటివరకూ ఉన్న ఆలోచనల్ని కొన్ని మాటలు ఇట్టే మార్చేయటమే కాదు.. అప్పటి వరకూ అనుసరించిన పంథాను సమూలంగా మార్చుకునేలా చేస్తాయి. అలాంటి పరిస్థితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాజాగా ఎదురైందని చెబుతున్నారు. అధికారం అరచేతిలో ఉన్నా.. కొడుక్కి రాజ్యాంగపరమైన బాధ్యతలు ఏమీ అప్పగించకుండా.. ఆయన్నో పవర్ గా మార్చేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్న బాబు తీరును ఆయన సన్నిహితులే తప్పు పడుతున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

చేతిలో అధికారం ఉన్నప్పుడే కీలక స్థానాలకు గ్రాండ్ గా ప్రమోట్ చేయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చేదు అనుభవం ఎదురుకావటం ఖాయమన్న మాటను ఉదాహరణలతో సహా బాబుకు ఈ మధ్యనే చెప్పినట్లుగా తెలుస్తోంది. తాజా పోలిక విన్న చంద్రబాబు.. తాను అనుసరిస్తున్న వైఖరిపై ఆలోచనలో పడినట్లుగా చెబుతున్నారు. ఏపీ సర్కారులో కొడుక్కి కీలక బాధ్యతలు ఇవ్వకుండా ఉన్న చంద్రబాబు.. తాను అలాంటి పని చేస్తే విమర్శలు వెల్లువెత్తుతాయన్న ఆలోచనతో జాగ్రత్తగా ఉండటం తెలిసిందే.

అధికారికంగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించకున్నా.. ఏపీ ప్రభుత్వంలో చాలా విషయాల్లో లోకేశ్ వేలు పెట్టకుండా ఉండరన్న విషయం బహిరంగ రహస్యం. అధికారికంగా పదవి ఇస్తే ఏదో జరుగుతుందన్నది ఉత్త భ్రమగా కొందరు నేతలు తమ వాదనను బాబు ముందు చేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి వైఖరిని యూపీఏ హయాంలో కాంగ్రెస్ అధినేత్రి తన కొడుకు రాహుల్ గాంధీ విషయంలో చేశారని.. కానీ.. చివరకు ఏమైందో అందరికి తెలిసిందేనని.. లోకేశ్ విషయంలోనూ చంద్రబాబు అలాంటి తప్పే చేస్తున్నారన్న మాటను చెప్పినట్లుగా తెలుస్తోంది.

అధికారంలో ఉన్నప్పుడే లోకేశ్ ను గ్రాండ్ గా లాంఛ్ చేయాలే తప్పించి.. అప్పుడు కామ్ గా ఉంటే.. పవర్ లేని సమయంలో బాధ్యతలు మీద పడితే.. అంత సమర్థంగా నిర్వర్తించే అవకాశం ఉండదని.. అందుకే.. పవర్ చేతిలో ఉన్నప్పుడే మంత్రి పదవి అప్పగించి.. ఆయన సత్తా చాటేందుకు అవకాశం ఇవ్వాల్సింగా కొందరు సీనియర్ నేతలు బాబుకు చెప్పినట్లుగా చెబుతున్నారు. రాహుల్ ఉదాహరణతో బాబులో స్పందన వచ్చిందని.. కొడుక్కి పదవిని అప్పగించే విషయమై ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన స్పందన బయటకు రావటం ఖాయమంటున్నారు.