Begin typing your search above and press return to search.

లోకేష్ కోసం ఢిల్లీని ప‌క్క‌న‌పెట్టిన బాబు

By:  Tupaki Desk   |   8 Oct 2016 11:43 AM GMT
లోకేష్ కోసం ఢిల్లీని ప‌క్క‌న‌పెట్టిన బాబు
X
తెలుగుదేశం పార్టీలో ప‌ద‌వుల పంప‌కంలో కీల‌క ప‌రిణామంపై ఇపుడు తెలుగు తమ్ముళ్ల‌లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్న కంభంపాటి రామ్మోహన్‌రావు రెండేళ్ల పదవీకాలం ముగిసింది. తనను మరోసారి కొనసాగిస్తారని కంభంపాటి భావించారు. అయితే పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు మూడు నెలలు కావ‌స్తున్నా త‌గిన నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు. కంభంపాటి విష‌యంలో క్లారిటీ రాక‌పోవ‌డం వెనుక కేంద్ర మంత్రి సుజనాచౌదరి - బాబు త‌న‌యుడు లోకేష్ ఉన్నార‌ని తెలుస్తోంది.

ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న‌ కంభంపాటి రామ్మోహన్‌ రావుకు కేంద్ర‌మంత్రి సుజ‌నాకు మధ్య‌ కోల్డ్‌ వార్‌ ఎప్పటినుంచో నడుస్తోందని పార్టీ వర్గాల కథనం. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కంభంపాటి ఉన్నా.. సుజనాచౌదరి ఆయనతో ముందునుంచీ అంటీ ముట్టినట్లుగా వ్యవహరించారని సమాచారం. పైగా ఏపీకి రావాల్సిన నిధులు - రెవిన్యూలోటు - విభజన హామీల అంశాలపై కంభంపాటిని పక్కకు పెట్టి.. సుజనాచౌదరియే అరుణ్‌ జైట్లీ లాంటి కీల‌క మంత్రుల‌తో మాట్లాడేవారు. ఇలాంటి సమావేశాలకు సంబంధించి నామమాత్రపు సమాచారం కూడా ఇచ్చేవారు కాదని కంభంపాటి చాలాకాలంగా గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు తన పదవి పొడిగింపునకూ సుజనా అడ్డుపడుతున్నారన్న బలమైన భావనలో కంభంపాటి ఉన్నారు. కంభంపాటి - సుజనా చౌదరిల మధ్య తారాస్థాయికి చేరిన తగవు.. ఇప్పుడు చంద్రబాబు సమక్షానికి చేరినట్లు భోగట్టా. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి లోకేశ్‌ పేరు తెరపైకి వచ్చింది. లోకేశ్‌ కు జాతీయ నేతలతో పరిచయాలు పెంచడం, ఢిల్లీ వ్యవహారాలు - రాజకీయాలపై మరింత అవగాహన కల్పించడం ద్వారా ఆయన రాజకీయ భవిష్యత్తుకు మరింత బలమైన పునాది వేయాలన్నదే బాబు భావనగా ప్రచారం జరిగింది. అయితే పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాష్ట్ర రాజకీయాల్లో మరింత పట్టు సాధించేందుకు.. లోకేశ్‌ ను ఇక్కడే ఉంచుతారనే ప్రచారమూ పార్టీలో జరుగుతోంది.

నారా లోకేశ్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావాలని నిర్ణయించుకుంటే.. కంభంపాటి పదవి కొనసాగింపునకు లైన్ క్లియర్ అయినట్లే అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే చంద్రబాబు ఎటూ తేల్చకపోవ‌డంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. మ‌రోవైపు ఇప్పటికే ఒకరిద్దరు ఎంపీలతో పాటు మరికొందరి పేర్లను ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు సుజనా సూచించారని టాక్... ఏదేమైనా... కోర్ టీంలోని ఇద్దరు సీనియర్‌ సభ్యుల మధ్య రేగిన ప్రత్యేక పోస్టు రగడ బాబుకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. మరి చంద్రబాబు ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారో వేచి చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/