Begin typing your search above and press return to search.

న‌యీం కేసులో చంద్ర‌బాబు చేయిపెడుతున్నారా

By:  Tupaki Desk   |   15 Sep 2016 9:40 AM GMT
న‌యీం కేసులో చంద్ర‌బాబు చేయిపెడుతున్నారా
X
ఓటుకు నోటు కేసుతోనే నానా త‌ల‌నొప్పులు ప‌డుతున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి తెలంగాణ‌లోని కీల‌క కేసులో వేలు పెడుతున్న‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. తాజాగా న‌యీం కేసులోనూ ఆయ‌న వేలు పెట్టిన‌ట్లు చెబుతున్నారు. దీనిపై మీడియాలో క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి. నయీం కేసు దర్యాప్తు ముందుకెళ్లకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నార‌ని చెబుతున్నారు. ముఖ్యంగా న‌యీంతో అంటకాగిన ఆరుగురు పోలీసు అధికారులు చంద్రబాబును శ‌ర‌ణు వేడ‌డంతో ఆయ‌న రంగంలోకి దిగిన‌ట్లు చెబుతున్నారు.

ఆ ఆరుగురు పోలీసు అధికారులకు మ‌ద్ద‌తుగా తెలంగాణ‌లోని ఒక టీడీపీ నేత చంద్ర‌బాబు వ‌ద్ద రాయ‌బారం చేసిన‌ట్లు చెబుతున్నారు. దీంతో వారిని బ‌య‌ట‌ప‌డేసేలా సొహ్రాబుద్దీన్ ఎన్‌ కౌంటర్ కేసును తెలివిగా తెరపైకి తెచ్చి నయీం కేసు విచారణకు బ్రేక్‌ వేసేందుకు సిద్దమవుతున్న‌ట్లు విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

సొహ్రాబుద్దీన్ ఎన్‌ కౌంటర్ కేసులో అప్పటి గుజరాజ్‌ హోంమంత్రి అమిత్‌ షా పైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అప్పట్లో నయీంను కలిసి తిరిగి వెళ్తున్న సమయంలోనే గుజరాత్ పోలీసులు సొహ్రాబుద్దీన్‌ ను ఎన్‌ కౌంటర్ చేశారు. ఆ సమయంలో ఏపీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే ఎన్‌ కౌంటర్ జరిగిందన్నది ఆరోపణ. ఇప్పుడు దీన్ని అసరాగా చేసుకుని తన వాళ్లను గట్టెక్కించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్న‌ట్లు చెబుతున్నారు. ఆ ఆరుగురు పోలీసు అధికారులు కేవలం సొహ్రాబుద్దీన్‌ గురించి తెలుసుకునేందుకే నయీంతో సంబంధాలు కొనసాగించారని అంతకు మించి వారికి ఏపాపం తెలియదని చంద్రబాబు కేంద్ర హోంశాఖ వ‌ద్ద చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. సొహ్రాబుద్దీన్ వ్య‌వ‌హారంలో అప్ప‌టి గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించేందుకు వారు న‌యీంతో సంబంధాలు నెరిపార‌న్న‌ట్లుగా కేంద్రానికి చంద్రబాబు చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్రెజ‌ర్ చేసి ఆ ఆరుగురిని కేసు నుంచి త‌ప్పించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. అయితే... గ‌త అనుభ‌వాల నేప‌థ్యంలో దీన్ని అడ్డం పెట్టుకుని చంద్ర‌బాబును కేసీఆర్ ప్ర‌భుత్వం మ‌రోసారి ఇరుకున‌పెట్టే ప్ర‌మాద‌ముంద‌ని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి.