Begin typing your search above and press return to search.

ఏపీలో హాట్ టాపిక్: బాబు త‌ర్వాత ఎవ‌రు?

By:  Tupaki Desk   |   3 Jan 2016 1:24 PM IST
ఏపీలో హాట్ టాపిక్: బాబు త‌ర్వాత ఎవ‌రు?
X
ఆంధ్రప్రదేశ్‌లో అతి త్వ‌ర‌లో చోటుచేసుకోనున్న కీల‌క ప‌రిణామంపై అధికారపార్టీతో స‌హా కార్య‌నిర్వాహ‌క విభాగ‌మైన ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో ఉత్కంఠ నెల‌కొంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్రదేశ్ అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు క్రియాశీలంగా ప‌నిచేస్తాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఈ కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. ప‌రిపాల‌నప‌రంగా చూస్తే ముఖ్య‌మంత్రి త‌ర్వాత అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వి ప్రభుత్వ ప్రధానకార్యదర్శిది. ప్ర‌స్తుతం ఈ ప‌ద‌విలో ఐవైఆర్ కృష్ణారావు కొనసాగుతున్నారు. కృష్ణారావు ప‌ద‌వీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియ‌నుంది. దీంతో కృష్ణారావు రిటైర్ కానున్నారా? ఆయ‌న స‌ర్వీసును పొడ‌గించే అవ‌కాశం ఉందా? ఆయ‌న రిటైర‌యిన త‌ర్వాత‌ ప్రధాన కార్యదర్శిగా ఎవ‌రు ఎంపిక‌వుతారు? అంటూ ఏపీలో జోరుగా చ‌ర్చ‌సాగుతోంది.

ఇందుకు తాజాగా జ‌రిగిన ఓ ప‌రిణామం ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోందని చెప్తున్నారు. తెలుగు రాష్ర్టాల ఉమ్మ‌డి గవర్నర్ నరసింహన్‌ను ఏపీ సీఎస్ కృష్ణారావు కలిశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివ‌రించడ‌మే కాకుండా తన రిటైర్ మెంట్ అంశాన్ని కూడా ప్ర‌స్తావించినట్టు సమాచారం. ఇదిలాఉండ‌గా... ప్ర‌స్తుత ప‌ద‌విలోనే కొన‌సాగ‌డానికి కృష్ణారావు ప్ర‌త్యేకంగా ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌ట్లేద‌ని తెలుస్తోంది. అయితే కృష్ణారావు సేవలు అవసరమని భావిస్తున్న ప్రభుత్వం ఆయన సర్వీసు పొడిగింపునకు కేంద్రాన్ని కోరాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ కేంద్ర ప్ర‌భుత్వం ఆయన సర్వీసులను పొడిగించిన పక్షంలో తక్షణం కొత్త చీఫ్ సెక్రటరీ ఎంపిక జరగదు.

అయితే కృష్ణారావు రిటైరయితే ఆ ప్లేస్‌లోకి ఎవ‌రు రానున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాలో ఎస్‌ పీ ఠక్కర్ ఉన్నారు. ఆయన తర్వాత సి విశ్వనాథం - ఎన్ రమేష్‌ కుమార్ - లింగరాజు పాణిగ్రాహి - టి విజయకుమార్ - ఎల్వీ సుబ్రహ్మణ్యం - అజేయకల్లాం - దినేష్‌ కుమార్ ఉన్నారు. అయితే వీరిలో ఎల్వీ సుబ్రహ్మణ్యం మినహా తక్కినవారంతా ఒక నెల అటూ ఇటుగా వరుసగా రిటైర్ కానున్నారు. 79వ బ్యాచ్‌ కు చెందిన ఆర్‌ పి వతల్ - ఐవి సుబ్బారావు కూడా రిటైర్ కానున్నారు. దాంతో 80వ బ్యాచ్‌ కు చెందిన అశ్విని కుమార్ పరీడా - 81వ బ్యాచ్‌ కు చెందిన చిర్రావూరి విశ్వనాథ్ - సత్య ప్రకాశ్ ఠక్కర్ - 82వ బ్యాచ్‌ కు చెందిన రమేష్‌ కుమార్ నిమ్మగడ్డ - లింగరాజు పాణిగ్రాహి - 83వ సంవత్సరం బ్యాచ్‌ కు చెందిన టి విజయకుమార్ పోటీలో ఉన్నారు. వీరిలో ఠక్కర్‌ కు సిఎస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా మ‌రో 15-20 రోజుల్లో బాబు త‌ర్వాతి పోస్టులో ఉండే అధికారి ఎవ‌రో క్లారిటీ రానుంది.