Begin typing your search above and press return to search.

గలీజు కానున్న ఎన్టీఆర్ ట్రస్టు లీజు ‘ వ్యవహారం

By:  Tupaki Desk   |   23 Sep 2015 11:49 AM GMT
గలీజు కానున్న ఎన్టీఆర్ ట్రస్టు లీజు ‘ వ్యవహారం
X
తెలిసి అడుసు మీద కాలు వేయటం అధికారపార్టీకి మామూలే. అందుకు తాము మాత్రం మినహాయింపు కాదని మరోసారి చెప్పేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. సేవా కార్యక్రమాలు నిర్వహించే ఎన్టీఆర్ ట్రస్ట్ కు సంబంధించి రెండు ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్ని లీజుకు ఇస్తూ అధికారిక నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఎన్టీఆర్ ట్రస్టుకు కేటాయించిన భూములు చిన్న మొత్తంలో ఉన్నా.. అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే ఇలాంటి నిర్ణయాలు ప్రతిపక్షాలకు అయుదాలుగా మారటమే కాదు.. ప్రభుత్వానికి మచ్చలుగా మారే ప్రమాదం ఉంది.

ట్రస్టు నిర్వహించే కార్యక్రమాల కోసం కాకినాడలో రెండు వేల గజాల్ని 99 సంవత్సరాల పాటు.. శ్రీకాకుళంలోని 1.79 ఎకరాల భూమిని చంద్రబాబు కుటుంబం నిర్వహించే ఎన్టీఆర్ ట్రస్టుకు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం 30 ఏళ్లకు మించి లీజుకు ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.

రూల్స్ కు విరుద్ధంగా 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడలో కేటాయించిన 2వేల గజాల భూమికి నెలకు రూ.25వేల చొప్పున అద్దె చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇక.. శ్రీకాకుళంలో కేటాయించిన భూమిని గతంలో గురుకుల పాఠశాలకు కేటాయించిన భూమి కావటం వివాదమయ్యే అవకాశం ఉందంటున్నారు. తాజా లీజు వ్యవహారం ఏపీ సర్కారుకు గలీజుగా మారటం ఖాయమంటున్నారు. అయినా.. సేవ చేయటానికి వివాదాలు కొని తెచ్చుకోవాలా ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే.. ఇలాంటివి మామూలేనని.. విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాదించేవారూ లేకపోలేదు. ఏది ఏమైనా.. లేని తలనొప్పులు కొని తెచ్చుకోవటం అవసరమా? అన్న ప్రశ్నను పలువురు తమ్ముళ్లు వ్యక్తం చేయటం గమనార్హం.