Begin typing your search above and press return to search.
జన్మధన్యమైందంటున్న బాబు
By: Tupaki Desk | 27 Dec 2016 6:08 PM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.1,981కోట్ల నాబార్డు రుణం స్వీకరించిన అనంతరం రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్మించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. ఆధునిక భారతదేశంలో అతిగొప్ప కట్టడం పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అని చంద్రబాబు ప్రశంసించారు. తన హయాంలోనే ఆ ప్రాజెక్టు పూర్తి కానుండటం సంతోషకరమని బాబు ముందుస్తుగా ఆనందాన్ని వ్యక్తం చేశారు!
పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా చేస్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన గేట్లు పోలవరానికి ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన సీఎం చంద్రబాబు డిసెంబరు 30 నుండి పోలవరం కాంక్రీటు వర్క్ మొదలుపెడతామని ప్రకటించారు. ప్రతిరోజూ రెండున్నర లక్షల నుంచి 3లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగిస్తున్నామని తెలిపారు. జనవరి నుండి డయాఫ్రం వాల్ నిర్మాణం వేగవంతం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎర్త్ వర్క్ మరియు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులను ప్రత్యేక నిర్మాణ సంస్థలకు అప్పగించామని వివరించారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా పోలవరం పనులకు నిధులు ఖర్చుచేస్తున్నామని, 2016 నవంబర్ నాటికి ప్రాజెక్టుపై దాదాపుగా రూ. 8682.43 కోట్లను ఖర్చు చేశామని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ. 3133. 75 కోట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టగా..ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయంలో ఇప్పటికే రూ. 935.00 కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించిందని చంద్రబాబు వెల్లడించారు.
2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న కృత నిశ్ఛయంతో ఉన్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు పరిధిలో 7.20 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం, అలాగే 24 టీఎంసీల నీటిని విశాఖపట్నం చుట్టు పక్కల ప్రాంతాల్లోని పరిశ్రమలకోసం వినియోగించుకోవచ్చునని వివరించారు. పోలవరం పూర్తి అయితే రాయలసీమ రతనాల సీమ అవుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వెలుగోడు - గాలేరు నగరి - స్వర్ణముఖి సోమశిల - ప్రాజెక్టులను త్వరగతిన పూర్తిచేస్తామని ప్రకటించారు. కేంద్రంతో రాజీపడలేదు....రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతోనే ఉన్నానని ఆయన వివరణ ఇచ్చారు. నా జీవితంలో ఇంత పనికిమాలిన రాజకీయాలు చూడలేదని, ప్రతిపక్షానికి అభివృద్ధిని అడ్డుకోవడమే పని అని చంద్బరాబు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/