Begin typing your search above and press return to search.

బాబుకు ఇదేం ప్ర‌చార యావ‌?

By:  Tupaki Desk   |   23 July 2016 9:27 AM GMT
బాబుకు ఇదేం ప్ర‌చార యావ‌?
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మ‌రోమారు ఆయ‌న ఇర‌కాటంలో ప‌డే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ ద‌ఫా ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌దే ప‌దే ప్రారంభించ‌డ‌మో లేక‌పోతే ప‌నుల్లో నాణ్య‌త లేక‌పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వ‌డం వ‌ల్లో కాదు. చంద్ర‌బాబు ప్ర‌చార కాంక్ష‌తో ఇలా జ‌రుగుతోంద‌ని అంటున్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తాజాగా ఉండవల్లిలో తన నివాసం నుంచి మూడు వేల మంది పార్టీ నాయకులు - ప్రజాప్రతినిధులు - సాగునీటి సంఘాల సభ్యులు - అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా బాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తికావడానికి ఇంకా రెండేళ్లు పడుతుందని - పట్టిసీమ ఎత్తిపోతల పథకం రికార్డు కాలంలో పూర్తిచేశామని - పోలవరం కుడి ప్రధాన కాలువ ఉపయోగించుకుని గోదావరి నీటిని కష్ణా డెల్టాకు తీసుకువచ్చామని బాబు వివరించారు. సముద్రానికి వథాగా పోయే గోదావరి నీటిని కష్ణా ఆయకట్టుకు మళ్లించి దేశంలోనే చరిత్ర సృష్టించామని ఆయన ఉద్ఘాటించారు. భూసేకరణలో రైతులు - ప్రజాప్రతినిధులు - అధికారులు మంచి సహకారం అందించారని కృతజ్ఞతలు తెలిపారు. కోర్టులో వేసిన కేసులను ఉపసంహరింపజేసి - యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేసి నీళ్లిచ్చామన్నారు. గతంలో సకాలంలో పంటలు వేయలేక పైర్లు ఆలస్యంగా సాగుచేసి తుపాన్లలో పంటలు దెబ్బతిని రైతులు చాలా నష్టపోయేవారని - పట్టిసీమ ద్వారా అలాంటి దుస్థితి లేకుండా చేశామని చంద్రబాబు తెలిపారు. అందుకే ఇంత‌టి త‌మ విజ‌యాల‌ను అభినందిస్తూ అన్ని గ్రామసభల్లోనూ తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా డెల్టా రైతులను కోరారు. అన్ని సాగునీటి సంఘాలు - గ్రామ పంచాయతీలు స్పందించి సభలు జరిపి తీర్మానాలను ఆమోదించాలని సూచించారు.

అయితే బాబు ప్ర‌క‌ట‌నపై ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం అవుతోంది. ప‌ట్టిసీమ‌తో రాయ‌ల‌సీమ‌కు మేలు జ‌రుగుతుంద‌ని చెప్పిన బాబు ఇప్ప‌టికీ ఆ ప్ర‌య‌త్నంలో విజ‌యవంతం కాలేద‌ని గుర్తుచేస్తూ అయిన‌ప్ప‌టికీ ఇదేం ప్ర‌చారయావ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కోస్తాలో ప‌ట్టిసీమ‌తో అంతా మంచే జ‌రిగితే...రైతులు పంట విరామం ఎందుకు ప్ర‌క‌టిస్తార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. బాబు ప్ర‌చారం శృతిమించుతోంద‌నే విష‌యాన్ని ఆయ‌న ఏనాడు తెలుసుకుంటారోన‌ని పలువురు పేర్కొంటున్నారు.