Begin typing your search above and press return to search.

మరో ముహుర్తానికి బాబు డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   6 Dec 2016 3:33 AM GMT
మరో ముహుర్తానికి బాబు డేట్ ఫిక్స్
X
రాష్ట్ర విభజన మాటేమో కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అని అదే పనిగా ముహుర్తాల మీద ముహుర్తాలు నిర్ణయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాజధాని నిర్మాణం మొదలు.. వివిధ కార్యక్రమాల కోసం ఆయన తరచూ మహుర్తాలు ఫిక్స్ చేయిస్తున్న వైనం తెలిసిందే. తాను చేసే ప్రతి పనిని అట్టహాసంగా చేయాలని తపించే తత్త్వం చంద్రబాబుకు కాస్త ఎక్కువే. ఈ కారణమే.. విపక్ష నేతలు ఆయన్ను తరచూ విమర్శిస్తుంటారు.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమం భారీగా చేపట్టటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఆ తర్వాత అమరావతిలో జరిగే ప్రతి కార్యక్రమానికి భారీతనాన్నిజోడించటం కనిపిస్తుంది. వెలగపూడిలో యుద్ధప్రాతిపదికన నిర్మించిన ఏపీ తాత్కాలిక సచివాలయంలో జరిగే ప్రతి చిన్న కార్యక్రమానికి మహుర్తాన్ని నిర్ణయించటం.. దానికి శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని పూర్తి చేయటం కనిపిస్తుంది. ఇలా.. ప్రతి పనికి మహుర్తాలు చూడటం అలవాటు చేసుకున్న బాబు పుణ్యమా అని.. ఈ మధ్యన ప్రతి పనిని మొదలు పెట్టటానికి గ్రాండ్ గా కార్యక్రమాల్ని ఏర్పాటు చేయటం జరుగుతున్నదే.

ఏపీ ప్రజల కలల ప్రాజెక్టు అయిన పోలవరానికి సంబంధించి ఒక కీలకమైన ముహుర్తాన్ని బాబు సెట్ చేశారు. రికార్డు వ్యవధిలో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించటం ద్వారా.. తన సత్తా అందరికి తెలిసేలా చేయాలని తపిస్తున్న బాబు.. ప్రతి సోమవారం.. ఈ ప్రాజెక్టు పనుల్ని వర్చువల్ రియాలిటీతో సమీక్షిస్తున్న వైనం తెలిసిందే. తాజాగా ఈ సోమవారం సైతం పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఆయనసమీక్షించారు. గతంతో పోలిస్తే.. ఈసారి మట్టిపనులు నిర్దేశిత లక్ష్యంలో 85 శాతం పూర్తి కావటం బాబుకు సంతృప్తి కలిగించినా.. సాంకేతిక సమస్యల్ని ప్రస్తావించిన వైనంపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటివి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోరా? అంటూ ఫైర్ అయిన చంద్రబాబు.. పోలవరం కాంక్రీట్ పనుల్ని ఈ నెల19న అట్టహాసంగా నిర్వహించాలని డిసైడ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డ్రయా ఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని జనవరి మొదటి వారంలో.. ఫ్యాబ్రికేటెడ్డ్యామ్ గేట్ల తయారీని సంక్రాంతి నుంచి షురూ చేయాలని డిసైడ్ చేశారు.

డిసెంబరు 19న చేపట్టే కాంక్రీట్ పనులకు కేంద్రమంత్రులు ఉమాభారతి.. వెంకయ్యలతో పాటు.. తన పార్టీకి చెందిన వారితో పాటుగా ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలను భారీగా హాజరయ్యేలా ఆయన ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఒక పండువగా నిర్వహించాలన్నది బాబు భావనగా చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం 10లక్షల టన్నుల సిమెంట్ అవసరం అవుతుందని భావిస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు.ఏది ఏమైనా అనుకున్న గడువులోపల ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి.. తన హయాంలో ఎంత వృద్ధి జరిగిందన్నది చేతల్లో చేసి చూపించాలని చంద్రబాబు తహతహలాడుతున్నారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/