Begin typing your search above and press return to search.

ఇప్పుడిక బాబు నీతులు చెప్పొచ్చు

By:  Tupaki Desk   |   1 Jun 2016 4:01 AM GMT
ఇప్పుడిక  బాబు నీతులు చెప్పొచ్చు
X
నోరు తెరిస్తే నీతులు అన్నట్లుగా ఉంటుంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాటల తీరు. మాటలకు తగ్గట్లుగా చేతలు ఉండాల్సి ఉన్నా.. కొన్ని సందర్భాల్లో ఆయన వ్యవహరించే తీరు నలుగురి చేత వేలెత్తి చూపించేలా ఉండటం తెలిసిందే. తాజాగా అలాంటి అవకాశాన్ని వెంట్రుక వాసితో ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారని చెప్పాలి. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం నాలుగు స్థానాలకు తెలుగుదేశం పార్టీ మూడు స్థానాల్లో.. ఒక స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంలో విపక్ష నేత జగన్ కు షాకివ్వాలన్న ఆలోచనకు వచ్చిన చంద్రబాబు.. నాలుగో అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిని ఒకరిని ఎన్నికల బరిలోకి దింపాలన్న ఆలోచన చేశారు. ఈ నిర్ణయం ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపటంతో పాటు.. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశాయి. ఇదిలా ఉంటే.. బాబును అభిమానించే వారిలో చాలామంది.. రాజ్యసభ ఎన్నికల విషయంలో ఆయన తీసుకుంటారని చెప్పిన నిర్ణయం అసంతృప్తికి గురి చేయటమే కాదు.. నాలుగో అభ్యర్థిని నిలపటం సమంజసం కాదన్న వాదన వినిపించింది.

ఇలాంటి సూచనే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నోటి నుంచి కూడా వచ్చింది. రాజ్యసభ ఎన్నికల బరిలో నాలుగో అభ్యర్థిని దింపాలన్న పట్టుదలతో ఉన్న బాబు.. ఉన్నట్లుండి నాలుగో అభ్యర్థి విషయంలో డ్రాప్ అయ్యారు. బీజేపీ మిత్రుల నుంచి వచ్చిన సూచనతోనే ఆయనీ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. రాజ్యసభకు నాలుగో అభ్యర్థిని నిలపకపోవటం ద్వారా.. చంద్రబాబుకు నీతులు చెప్పే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఒకవేళ నాలుగో అభ్యర్థిని రంగంలోకి దింపితే.. విలువల గురించి బాబు మాట్లాడే అవకాశం ఉండేది కాదని.. ఒకవేళ మాట్లాడినా ఎబ్బెట్టుగా ఉండేదన్న అభిప్రాయాన్ని పలువురు బాబు అభిమానులే చెప్పటం గమనార్హం.