Begin typing your search above and press return to search.

రామ‌సుబ్బారెడ్డికి న్యాయం జ‌ర‌గ‌దంతే!

By:  Tupaki Desk   |   2 July 2017 8:20 AM GMT
రామ‌సుబ్బారెడ్డికి న్యాయం జ‌ర‌గ‌దంతే!
X
ఏపీలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లో స‌త్తా చాటేందుకు అధికార టీడీపీ నేత‌లు - ప్ర‌త్యేకించి ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు చూపుతున్న ఉత్సాహం అంతా ఇంతా కాద‌నే వాదన‌ కొత్త‌గా తెర‌పైకి వ‌చ్చేసింది. జ‌గ‌న్‌ ను రాజ‌కీయంగా దెబ్బ కొట్టేందుకు ఆ జిల్లాలో వైసీపీ టికెట్‌ పై గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డికి పెద్ద ఎత్తున తాయిలాలు ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు... ఆయ‌న‌కు రెడ్ కార్పెట్ స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీ నేత‌ - మాజీ మంత్రి - ఆది నుంచి టీడీపీనే న‌మ్ముకుని ఉన్న రామ‌సుబ్బారెడ్డి... ఈ య‌త్నాన్ని అడ్డుకునేందుకు చేసిన య‌త్నాల‌న్నీ కూడా విఫ‌ల‌మ‌య్యాయ‌నే చెప్పాలి. ఎప్ప‌టిక‌ప్పుడు రామ‌సుబ్బారెడ్డిని చ‌ల్ల‌బ‌రుస్తూ, అది చేస్తాం, ఇది చేస్తాం, ఆ ప‌ద‌వి ఇస్తాం... అంటూ చెప్పుకుంటూ చంద్ర‌బాబు కాలం వెళ్ల‌దీస్తున్నారు.

ఓ వైపు చంద్ర‌బాబు బుజ్జ‌గింపు రాజ‌కీయాలు చేస్తున్న త‌రుణంలోనే మ‌రోవైపు టీడీపీలో చేరిన ఆదినారాయ‌ణ రెడ్డి - ఆ త‌ర్వాత మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకుని, ఇప్పుడు జ‌మ్మ‌ల‌మ‌డుగులో రామ‌సుబ్బారెడ్డిని త‌లెత్తుకుని రాజ‌కీయం చేసే అవ‌కాశాలే లేకుండా చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదంతా ఉత్తినే చెబుతున్న విష‌యాలు కాదు... సాక్షాత్తు రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం పార్టీ అధినేత చంద్ర‌బాబు ముందు వినిపించిన అస‌లు సిస‌లు వాద‌న‌. ఈ వాద‌న వింటే... నిజంగానే జ‌మ్మ‌ల‌మ‌డుగులో రామ‌సుబ్బారెడ్డికి తీర‌ని అన్యాయం జ‌రిగిపోతోంద‌ని ఒప్పుకోక త‌ప్పుదు. ఆ విష‌యాల్లోకి వ‌స్తే... మొన్న‌టిదాకా విప‌క్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయ‌ణ రెడ్డి... ఎమ్మెల్యే హోదాలో జారీ చేసిన ఆదేశాల‌ను అధికార యంత్రాంగం ఇష్టం లేకున్నా ఏదో చేశామంటే చేశాం అన్న రీతిలో స్పందించేది. అయితే వైసీపీని వ‌దిలేసి టీడీపీలో చేరిన వెంట‌నే ఆది చెప్పిన ప‌నుల‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. ఇప్పుడు అదే ఎమ్మెల్యే మంత్రిగా మార‌డంతో ఆ దిశ‌గా అధికారులు మ‌రింత వేగంగా స్పందిస్తున్నారు.

మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆదినారాయ‌ణ రెడ్డి ఇస్తున్న ఆదేశాల మేర‌కు అధికారులు స్పందించ‌డంలో త‌ప్పేమీ లేదు గానీ... అధికార పార్టీ నేత‌గా - మాజీ మంత్రిగానే కాకుండా అధికార పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ చార్జీగా ఉన్న రామ‌సుబ్బారెడ్డి మాట కూడా కాస్తైనా వినాలి క‌దా. అయితే ఇక్క‌డ ఆదికి రామ‌సుబ్బారెడ్డికి ప‌డ‌దు కాబ‌ట్టి... అధికారులు ఏదో ఒక వైపు మాత్ర‌మే ఉండాల్సి వస్తోంది. అధికారుల విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... రామ‌సుబ్బారెడ్డికి రెండు విష‌యాల్లో ఆదినారాయ‌ణ‌రెడ్డి ప‌రువును బ‌జారున ప‌డేశారు. ఆది మంత్రిగా కాక‌ముందు జ‌మ్మ‌ల‌మ‌డుగు మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్‌ గా ఉన్న ల‌క్ష్మీరాజ్యం ప‌నితీరుతో విసుగు చెందిన రామ‌సుబ్బారెడ్డి... ఆ అధికారిని బ‌దిలీ చేయించి ఆ స్థానంలో మ‌ధుసూద‌న్ రెడ్డిని వేయించుకున్నారు. అయితే ఆది మంత్రి కాగానే... మ‌ధుసూద‌న్ రెడ్డిని బ‌దిలీ అయిపోగా... ఆ స్థానంలో రామసుబ్బారెడ్డి వ‌ద్ద‌నుకుని బ‌దిలీ చేయించిన ల‌క్ష్మీరాజ్యం వ‌చ్చి కూర్చున్నారు. రామ‌సుబ్బారెడ్డికి చెక్ పెట్టేందుకే ఆది ఈ ప‌ని చేశార‌ని నాడు గుస‌గుస‌లు వినిపించాయి.

అయినా మ‌ధుసూద‌న్ రెడ్డి వ‌ద్ద‌నుకుంటే... ఇంకో అధికారిని తెచ్చుకోవాలి గానీ... రామ‌సుబ్బారెడ్డి వ‌ద్ద‌నుకున్న అధికారిని తిరిగి అక్క‌డ పోస్టింగ్ చేయించ‌డ‌మంటే ఆయ‌న ప‌రువు తీసిన‌ట్టే క‌దా. ఈ విష‌యంపై రామ‌సుబ్బారెడ్డి తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేస్తూ... విష‌యాన్ని మునిసిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ దృష్టికి తీసుకెళ్లినా ఫ‌లితం క‌నిపించ‌లేద‌ట‌. ఇక రెండో విష‌యానికి వ‌స్తే... ఇటీవ‌లే జ‌మ్మ‌ల‌మ‌డుగుకు ఓ బార్ అండ్ రెస్టారెంట్ మంజూరైంది. పార్టీలో ఆది నుంచి కొన‌సాగుతూ వ‌స్తున్న రామ‌సుబ్బారెడ్డి దానిని త‌న అనుచ‌ర వ‌ర్గంలోని ఎవ‌రికో ఒక‌రికి ఇప్పించుకోవాల‌ని య‌త్నించ‌డంలో అంతగా త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌ర‌మేమీ లేదు. ఇదే రీతిలో రామ‌సుబ్బారెడ్డి దానిని ద‌క్కించుకునేందుకు బిడ్ దాఖ‌లు చేయడానికి వెళితే... సంబంధిత కార్యాల‌యంలో ఒక్క అధికారి కూడా క‌నిపించ‌లేద‌ట‌. ఆ మ‌రునాడే స‌ద‌రు బార్ అండ్ రెస్టారెంట్ ఎమ్మెల్సీగా పార్టీ ఫిరాయించిన దేవ‌గుడి నారాయ‌ణ రెడ్డి అల్లుడు న‌ర‌సింహారెడ్డి చేతికి వెళ్లిపోయింది.

రామ‌సుబ్బారెడ్డి బిడ్ దాఖ‌లు చేసేందుకు వ‌స్తున్నార‌న్న స‌మాచారంతో ఆది అనుచ‌రులు అప్ర‌మ‌త్తం చేయ‌డంతో ఆఫీసులో ఒక్క అధికారి కూడా క‌నిపించ‌కుండా పోయార‌ట‌. ఈ రెండు ఘ‌ట‌న‌లు చాలు జ‌మ్మ‌ల‌మ‌డుగులో రామ‌సుబ్బారెడ్డి ఎంత‌గా అవ‌మానాలకు గుర‌వుతున్నారో చెప్పేందుకు. మ‌రి ఇవ‌న్నీ పార్టీ అధినేత‌గా ఉన్న చంద్ర‌బాబుకు తెలియ‌వా? అన‌డానికి ఏమీ లేదు. ఎందుకంటే ఎక్క‌డ ఏం జ‌రిగినా... క్ష‌ణాల్లో తెలుసుకునే చంద్ర‌బాబు... రామ‌సుబ్బారెడ్డి విష‌యంలో త‌న‌కేమాత్రం తెలియ‌ద‌ని చెబితే ఏ ఒక్క‌రూ న‌మ్మ‌డానికి సిద్ధంగా లేరు. మ‌రి ఈ విష‌యం రామ‌సుబ్బారెడ్డికి కూడా అర్థ‌మ‌య్యే ఉంటుంది క‌దా. అంటే... చంద్ర‌బాబుకు తెలిసే ఈ వ్య‌వ‌హారాల‌న్నీ సాగుతున్నాయ‌ని తెలుసుకున్న రాసుబ్బారెడ్డి త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసేందుకు మొన్న‌టి మినీ మ‌హానాడు, మ‌హానాడు ద‌రిదాపుల్లోకి వెళ్ల‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/