Begin typing your search above and press return to search.

రచ్చ రావెల

By:  Tupaki Desk   |   24 Dec 2016 7:40 AM GMT
రచ్చ రావెల
X
బ్యూరోక్రసీ నుంచి పాలిటిక్సులోకి అడుగుపెట్టి ఫస్టు అటెంప్టులోనే గెలుపు సాధించడమే కాకుండా మంత్రి పదవి కూడా కొట్టేసిన అదృష్టవంతుడాయన. పదవి కొత్త, నియోజకవర్గం కొత్త, రాజకీయం కొత్త.. అయినా, ఆయన తీరు మాత్రం 30 యియర్స్ ఇండస్ట్రీ అన్నట్లుగా ఉంటుంది. రెండున్నరేళ్ల కాలంలోనే తానొక్కడే కాదు, కొడుకు కూడా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. బహుశా ఇటీవల కాలంలో పాలిటిక్సులో ఇంత తక్కువ కాలంలో రచ్చరచ్చ చేసుకున్న నాయకులెవరూ లేరేమో. ఆయన ఇంకెవరో కాదు. ఏపీ మినిష్టర్ రావెల కిశోర్ బాబు.

రైల్వే అధికారి నుంచి రాజకీయ నేతగా అవతారమెత్తి - తొలి పోటీతోనే మంత్రి పదవి పొందిన రావెల తీరు కారణంగా నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ఠ మంటగలుస్తోందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. రావెల ఇన్ని తప్పులు చేస్తున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదనీ అంటున్నారు. ముఖ్యంగా రావెల.. యువనేత లోకేశ్ పేరు చెప్పుకొంటూ ఇష్టారాజ్యం సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తొలిసారి ఎమ్మెల్యే అయిన రావెలకు దళిత క్రైస్తవ కార్డుతో పదవి లభించినా, ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. సొంత నియోజకవర్గం నేతలనే ఇప్పటివరకూ గుర్తుపట్టరని, నేతలు వెళితే అవమానకరంగా మాట్లాడతారని, మాట్లాడే తీరు ఎవరికైనా ఆగ్రహం తెప్పిస్తోందనీ అంటున్నారు.

రావెల తీరుకు నిరసనగా ఇప్పటికే ఎందరో బాహాటంగా అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంపిపి తోట మల్లీశ్వరి మంత్రి వ్యవహార శైలికి నిరసనగా ఏకంగా నిరాహార దీక్ష చేసిన వైనం గతంలో సంచలనం సృష్టించింది. మంత్రి తనను అవమానిస్తున్నారంటూ ఆమె దీక్ష నిర్వహించగా, నాయకత్వం ఆ వ్యవహారాన్ని సర్దుబాటు చేసింది. పత్తిపాడు మండలంలోని బొర్రావారిపాలెంలోని ఎస్టీలు తమకు పట్టాలివ్వాలని రెండేళ్ల నుంచి మంత్రి చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించలేదు. దాంతో వారు ఇటీవల సీఎం చంద్రబాబును కలసి వేడుకోగా బాబు స్పందించి పట్టాలిప్పిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మంత్రిని కలిసిన ఎస్టీలపై రావెల మండిపడి ‘గెటౌట్! సిఎం దగ్గరకు వెళ్లారుగా. ఆయనతోనే ఇప్పించుకోండ’ని వారిని నానా మాటలు అన్నట్లు ఆరోపణలున్నాయి.

ఇక మంత్రి కుమారుడు హైదరాబాద్ లో ఓ మహిళ చేయి పట్టుకోగా ఆయనపై నిర్భయ కేసు నమోదైంది. తాజాగా మంత్రి వేధింపులపై ఏకంగా మహిళా జడ్పీ ఛైర్మన్ గోడు వెల్లగక్కడం గమనార్హం. మరి చంద్రబాబు ఇప్పటికైనా రావెలకు కళ్లెం వేస్తారో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/