Begin typing your search above and press return to search.

'రావెల ర‌చ్చ' క‌మిటీ కామెడీ అయిపోద్దా?

By:  Tupaki Desk   |   25 Dec 2016 5:30 PM GMT
రావెల ర‌చ్చ క‌మిటీ కామెడీ అయిపోద్దా?
X
కేబినెట్ హోదాలో ఉన్న మంత్రి రావెల కిశోర్ బాబుపై సాక్షాత్తు సొంత పార్టీకి చెందిన జెడ్పీ చైర్మ‌న్ జానీమూన్‌ విమ‌ర్శ‌లు చేయ‌డం ఏపీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఈ ప‌రిణామం జ‌రిగిన మ‌రుస‌టి రోజు స్పందించిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్ర‌బాబు ముగ్గురి నేత‌ల‌తో క‌మిటీ ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిణామాలు స‌హించేది లేద‌న్న‌ట్లుగా మీడియాకు లీకులు ఇప్పించారు. అయితే ఇది తెలుగుదేశం మార్క్ రాజ‌కీయాల్లో అత్యంత స‌హ‌జ‌మ‌ని ఆ పార్టీ వ్య‌వ‌హారాలు గ‌మ‌నించిన వారు అంటున్నారు. రావెల ర‌చ్చ‌పై వేసిన క‌మిటీ కామెడీగా మారిపోతుంద‌ని ఉద‌హ‌రిస్తున్నారు. గ‌తంలో ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడి విష‌యంలో జ‌రిగిన ఉదంతాన్ని ప్ర‌స్తావిస్తున్నారు.

కేఈ సోద‌రుడు ప్ర‌భాక‌ర్ పార్టీ ప‌రువును బజారు పాలు చేసేసిన ఉదంతానికి వ‌స్తే....ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీసీలకు టికెట్‌ ఇవ్వకుండా తెలుగుదేశంలోకి ఫిరాయించిన టీజీ వెంకటేష్‌ కు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కర్నూల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డబ్బునోళ్లకే సీటు ఇచ్చే పద్ధతి మార్చుకోకపోతే బీసీలు టీడీపీని కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తారని ఆయన పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. తమ కన్నా బీసీలకు సేవ చేసినవారెవరున్నారంటూ రాజ్యసభ సీటు పొందిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ ను పరోక్షంగా టార్గెట్ చేశారు. తొలుత జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ టికెట్లను అమ్ముకుందంటూ నిరసన వ్య‌క్తం చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం టీడీపీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభాకర్ ధ‌ర్నాకు దిగారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. మొదటి నుంచీ పార్టీకి అంకితమైన వారిని విస్మరించి నిన్నామొన్నా పార్టీలో చేరిన టీజీ వెంకటేష్‌ కు రాజ్యసభ టికెట్‌ ఎలా ఇస్తారని ప్ర‌భాకర్‌ ప్రశ్నించారు. జిల్లా నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలతోపాటు బీసీ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేసి మ‌రీ ఈ నిర‌స‌న చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

ఇలా పార్టీ ప‌రువును న‌డిరోడ్డున ప‌డేసిన ప‌రిణామంపై చంద్ర‌బాబు ఏం చేశారో తెలుసా? ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారని మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చేలా చేశారు! అనంత‌రం పార్టీ త‌ర‌ఫున క‌మిటీ వేశారు!! నివేదిక ఇవ్వ‌మ‌న్నారు. ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ఆ క‌మిటీ నివేదిక ఇచ్చిందా లేదా అనేది తెలియ‌దు. దానిపై పార్టీ చ‌ర్య తీసుకున్నదా లేదా అంత‌కంటే తెలియ‌దు. అలా చంద్ర‌బాబును ఏకిపారేసిన ఉదంతంపైనే క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు లేన‌పుడు...మ‌హిళ‌ల విష‌యంలో త‌ర‌చుగా వివాదంలో చిక్కుకుంటున్న రావెల విష‌యంలో చ‌ర్య‌లుంటాయా? ఈ క‌మిటీ కామెడీ అవ‌డం త‌ప్ప మ‌రేం ఉండ‌దు అని టీడీపీ రాజ‌కీయాల‌ను లోతుగా ప‌రిశీలించిన వారు తేల్చిపారేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/