Begin typing your search above and press return to search.

బాబు మాట..రేవంత్‌ పై దాడులు నీచ‌మ‌ట‌

By:  Tupaki Desk   |   28 Sep 2018 7:27 PM GMT
బాబు మాట..రేవంత్‌ పై దాడులు నీచ‌మ‌ట‌
X
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు - మనీ లాండరింగ్ - పన్ను ఎగ్గొట్టారనే మూడు ప్రధాన అభియోగాలపై అధికారులు రేవంత్ రెడ్డిని విచారిస్తున్నారు. రెండో రోజూ కొనసాగిన ఈ దాడుల్లో రేవంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు - బ్యాంకు లాకర్లపై అధికారులు ఆరా తీశారు. రేవంత్ భార్య గీతను ఐటీ అధికారులు బ్యాంకులకు తీసుకెళ్లారు. 3 బ్యాంకుల్లో లాకర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ కి చెందిన వివిధ కంపెనీలకు చెందిన వివరాలను అధికారులు సేకరించారు. రేవంత్ రెడ్డి వివిధ డాక్యుమెంట్లపై చేసిన సంతకాల పరిశీలన కోసం ఫొరెన్సిక్ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చారు. రేవంత్ నుంచి ఆయన సంతకాలను - వేలిముద్రలను సేకరించారు. సంతకాలు - వేలిముద్రలు తీసుకొన్న తర్వాత ఫొరెన్సిక్ బృందం సభ్యులు తిరిగి వెళ్లిపోయారు. రేవంత్ ఇంట్లోని కంప్యూటర్ లలో డిలిట్ చేసిన సమాచారాన్ని ఎఫ్ ఎస్ ఎల్ బృందం సేకరించింది. ఓటుకు నోటు కేసులో సహ నిందితుడైన ఉదయసింహను అధికారులు రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రశ్నించారు.

కాగా, ఈ ప‌రిణామంపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు పరోక్షంగా స్పందించారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్ద దొంగలను పట్టుకోదని.. అధికారాన్నిరాజకీయాలకు ఉపయోగిస్తోందని మండిపడ్డారు. ఒక్క రేవంత్ అంశం అనే కాదని..ఎన్నికలొచ్చే ప్రతి చోటా కేంద్రం ఇదే తరహా రాజకీయం చేస్తోందన్నారు. రాజకీయ పార్టీలకు ఒక పద్ధతి ఉండాలన్న బాబు.. ఇంత నీచ రాజకీయాలకు దిగడం దారుణమన్నారు. తమిళనాడులో ఏం జరిగిందో ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని బాబు అన్నారు.

మ‌రోవైపు రేవంత్‌ రెడ్డి ఇంటివ‌ద్ద హ‌ల్ చ‌ల్ కొన‌సాగుతోంది. ఇవాళ సాయంత్రం కొడంగల్‌ నుంచి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు.. తమకు రేవంత్‌ రెడ్డిని చూపించాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈక్రమంలో రేవంత్‌ రెడ్డి అనుచరులు కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది జరిగిన కాసేపటికి రేవంత్‌ రెడ్డి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి తిరిగి లోప‌లికి వెళ్లిపోయారు.