Begin typing your search above and press return to search.

బాబు గారూ!...కాపీ కొట్టినా ఫ‌లితం లేదండీ!

By:  Tupaki Desk   |   5 Feb 2019 5:21 PM GMT
బాబు గారూ!...కాపీ కొట్టినా ఫ‌లితం లేదండీ!
X
కాపీ మాస్ట‌ర్‌ గా మారిపోయిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచేయాల్సిందేన‌ని తీర్మానించుకున్నారు. ఇందుకోసం త‌నకంటూ సొంత ప‌థ‌కాలు లేని వాస్త‌వాన్ని గ‌మ‌నించి.. ఇత‌ర నేత‌లు, పార్టీలు... ముఖ్యంగా త‌న‌కు రాజ‌కీయంగా బ‌ద్ధ విరోధులుగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌తో పాటు టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు అమ‌లు చేసిన ప‌థ‌కాల‌ను నిస్సిగ్గుగానే కాపీ కొట్టేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన పింఛ‌న్ల పెంపు - ఆటోల‌కు ట్యాక్స్ ఎత్తివేత త‌దిత‌రాల‌ను కాపీ కొట్టేసిన చంద్ర‌బాబు.. తెలంగాణ‌లో కేసీఆర్‌ కు రెండో ద‌ఫా విజ‌యం సాధించిపెట్టిన రైతు బంధును కూడా మ‌క్కికి మ‌క్కీ దించేశారు. ఈ ప‌థ‌కం జ‌గ‌న్ కూడా కేసీఆర్ కంటే ముందుగానే రూప‌క‌ల్ప‌న చేసిన విష‌యం కూడా తెలిసిందే. ఈ ప‌థ‌కం రైతాంగానికి పున‌రుజ్జీవం ఇవ్వ‌డ‌మే కాకుండా అన్న‌దాత‌ల‌ను అప్పుల బాట ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తుంద‌న్న‌ది ఇటు జ‌గ‌న్‌, అటు కేసీఆర్ భావ‌న‌.

అయితే ఏనాడూ సంక్షేమం గురించి ప‌ట్టించుకున్న పాపాన‌పోని చంద్ర‌బాబు... ఇప్పుడు మాత్రం ఆ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టేయ‌డ‌మే కాకుండా హామీలిస్తే కుద‌ర‌ద‌ని, ఏకంగా అమ‌లు చేసి పారేస్తున్నారు. అయితే కొత్త సంక్షేమ ప‌థ‌కాల‌ను ర‌చించ‌డం చేత‌గాని చంద్ర‌బాబుకు... క‌నీసం ప్ర‌జాద‌ర‌ణ పొందిన ప‌థ‌కాల‌ను ప‌క్కాగా కాపీ కొట్ట‌డం కూడా రాద‌ని ఇప్పుడు తేలిపోయింది. ఇందుకు ఉదాహ‌ర‌ణే నేటి ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ లో ఏపీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నోట నుంచి వినిపించిన అన్న‌దాతా సుఖీభ‌వ ప‌థ‌కం. రైతు బంధు ప‌థ‌కానికి పేరు మార్చేసిన చంద్ర‌బాబు... నిధుల విష‌యంలోనూ కేసీఆర్ మాదిరిగానే ఎందుకెళ్లాల‌ని భావింన‌ట్టుగా ఉంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. కేసీఆర్ స‌ర్కారు రైతు బంధు అమ‌లు కోసం ఏకంగా రూ.1,500 కోట్ల‌ను కేటాయించిన సంగ‌తి తెలిసిందే. ఈ నిధుల‌తో తెలంగాణ‌లోని 58.30 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం ద‌క్కింది. అయితే తెలంగాణ‌తో పోల్చితే ఏపీలో సాగు భూమి అధిక‌మే క‌దా. అంతేనా.. రైతుల సంఖ్య కూడా ఏపీలో తెలంగాణ కంటే అధికంగానే ఉన్నారు. మ‌రి వీరంద‌రికి ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాలంటే క‌నీసం రూ.2,000 కోట్ల‌యినా కావాల్సిందే క‌దా.

అయితే చంద్ర‌బాబు స‌ర్కారు మాత్రం ఈ ప‌థ‌కానికి కేవ‌లం రూ.500 కోట్ల‌ను కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంతేకాకుండా ఈ ప‌థ‌కం విధి విధానాల‌ను కూడా చంద్ర‌బాబు స‌ర్కారు ప్ర‌క‌టించ‌లేదు. వెరసి ఈ ప‌థ‌కం ఎంత‌మందికి అందుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. పెద్ద రైతుల‌కు ఈ ప‌థ‌కం అవ‌స‌రం లేద‌ని.. చిన్న‌, మ‌ధ్య త‌ర‌గ‌తి రైతుల‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేస్తే స‌రిపోతుంద‌న్న కోణంలో కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు యోచిస్తున్న తీరు మాదిరే చంద్ర‌బాబు ఆలోచించినా... ప‌థ‌కానికి నిధులు కేటాయిస్తూ విధి విధానాలు ప్ర‌క‌టించ‌క‌పోవ‌డ‌మేమిటో అర్థం కావ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. పింఛ‌న్లు, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు తాయిలాలు ప్ర‌క‌టించ‌డంతో పాటుగా వెనువెంట‌నే వాటి పంపిణీని చేప‌ట్టేసిన చంద్ర‌బాబు స‌ర్కారు... అన్న‌దాత సుఖీభ‌వ విష‌యంలో మాత్రం ఇంకా ఓ స్ప‌ష్ట‌త‌కు రాన‌ట్టుగానే తెలుస్తోంది. మొత్తంగా కాపీ కొట్టిన ప‌థ‌కాన్ని కూడా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌వుతున్నార‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.