Begin typing your search above and press return to search.

ఇది అదృష్ట‌మా..ఏపీ ప్ర‌జ‌ల దుర‌దృష్ట‌మా చంద్ర‌బాబు?

By:  Tupaki Desk   |   28 Nov 2018 2:06 PM GMT
ఇది అదృష్ట‌మా..ఏపీ ప్ర‌జ‌ల దుర‌దృష్ట‌మా చంద్ర‌బాబు?
X
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తో కలసి తెలుగుదేశం పార్టీ వేదికను పంచుకోవడం చారిత్రక ఘట్టం, దీనికి వేదికగా నిలిచిన ఖమ్మం చరిత్రలో నిలిచిపోతుంది``... ఈ మాట‌లు అన్న‌ది కాంగ్రెస్‌లో చోటామోటా నేత కాదు. చిన్నా చిత‌కా పార్టీ నాయ‌కుడు కూడా కాదు. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశంలోని పార్టీల‌న్నింటినీ ఏకం చేస్తున్నాన‌ని...బీజేపీకి వ్య‌తిరేకంగా స‌మీకరిస్తున్నాన‌ని చెప్పుకొంటున్న చంద్ర‌బాబు రాహుల్తో వేదిక పంచుకునుడే అదృష్ట‌మ‌ని ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే...రాజ‌కీయ‌వ‌ర్గాలే ఆశ్చ‌ర్య‌పోతున్నాయి.

వాస్త‌వంగా చంద్ర‌బాబు గ‌తంలో చేసిన ప్ర‌చారాన్ని ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌ను పోల్చిచూస్తే చిత్రంగా ఉందంటున్నారు. దేశంలోనే తాను అంద‌రికంటే, ఇంకా చెప్పాలంటే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కంటే కూడా తానే సీనియ‌ర్‌ను అని చంద్ర‌బాబు అనేక సంద‌ర్భాల్లో ప్ర‌క‌టించుకున్న సంగ‌తి తెలిసిందే. దీనికి తోడుగా ప్ర‌జలు చంద్ర‌బాబును గౌర‌వించేది కూడా ఆయ‌న విద్వ‌త్తు (?) ఆధారంగానే. ఎక‌నామిస్ట్‌ - టెకీ - రాజ‌కీయ‌వేత్త అనే భావ‌న‌తో 2014 ఎన్నిక‌ల్లో మిగ‌తా వారిని తోసిరాజ‌ని చంద్ర‌బాబుకు అవ‌కాశం ఇచ్చారు. కొత్త రాష్ట్రం క‌దా రిస్క్ ఎందుకులే అని అవ‌కాశం ఇచ్చారు. (దానికి జ‌నం ఇపుడు రిగ్రెట్ అవుతున్నారు, అది వేరే విష‌యం). అలాంటి గుర్తింపు క‌లిగి ఉన్న చంద్ర‌బాబు తాజాగా రాహుల్‌తో క‌లిసి `వేదిక పంచుకున్నందుకే` `గ‌ర్వంగా` ఫీలయ్యారంటే విన‌డానికి చిత్రంగా ఉండ‌టమే కాదు, జ‌నాల‌కు కొత్త అనుమానాలు వ‌స్తున్నాయి.

2014 క ముందు త‌ర్వాత రాహుల్ పలు యూనివ‌ర్సిటీలు తిరిగారు. ఆ సంద‌ర్భంగా విద్యార్థుల‌తో ఇంటరాక్ట్ అయిన‌పుడు చాలామంది విద్యార్థులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు నీళ్లు న‌మిలారు. రాజ్యాంగంపై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయన స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు. దీనికి తోడుగా, రాహుల్ ప‌రిజ్ఞానం గురించి సోష‌ల్ మీడియాలో అనేక ర‌కాలైన సెటైర్లు ఉన్నాయి. అలాంటి రాహుల్‌గాంధీతో వేదిక పంచుకోవ‌డ‌మే త‌న‌ అదృష్టంగా భావించ‌డం చంద్ర‌బాబు త‌నను తాను ఏ విధంగా స్థాయి త‌గ్గించుకుంటున్నారో తెలుస్తుంద‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. అయితే, చంద్ర‌బాబు స్థాయి త‌గ్గించుకుంటున్నారా? లేక చంద్ర‌బాబు స్థాయే అంత‌నా? అని విశ్లేష‌కులు కొత్త డౌట్లు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. రాహుల్‌తో వేదిక పంచుకునుడే అదృష్ట‌మ‌ని భావించే చంద్ర‌బాబు... జాతీయ స్థాయిలో ఘ‌నాపాటీల‌ను ఎలా స‌మీక‌రించ‌గ‌లుగుతార‌న్న‌ది ఇపుడు పెద్ద ప్ర‌శ్నే.