Begin typing your search above and press return to search.

టీడీపీ జాతీయ పార్టీ కలలు జోకేనా?

By:  Tupaki Desk   |   12 March 2016 11:30 AM GMT
టీడీపీ జాతీయ పార్టీ కలలు జోకేనా?
X
ఏడాది కిందట... తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ఎదిగేలా చేయడానికి భారీ ప్రణాళికలు రచించారు చంద్రబాబు. ఏపీ - తెలంగాణ రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించి తాను జాతీయ అధ్యక్షుడయ్యారు. ఏపీ - తెలంగాణలతో పాటు ఒడిశా - మహారాష్ట్ర - తమిళనాడు - కర్ణాటక - అండమాన్ నికోబార్ దీవుల్లో పాగా వేయాలని ప్లాన్లు వేశారు. చంద్రబాబు చరిత్ర సృష్టించేస్తారేమో అని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ... ఈ రోజు సమైక్యాంధ్రలోని సగభాగం తెలంగాణ రాష్ట్రంలోనే టీడీపీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితికి చేరింది. ఎన్నికల్లో టీఆరెస్ ఊపును తట్టుకుని చెప్పుకోదగ్గ సీట్లు గెలుచుకున్నా గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో మాత్రం చంద్రబాబు విఫలమయ్యారు. అంతేకాదు... టీడీపీని వీడి టీఆరెస్ లో చేరుతున్నవారిలో ఆంధ్ర సెటిలర్లయిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందినవారు ఉన్నా కూడా వారిని ఆపలేకపోయారు. వారిని టీఆరెస్ సభ్యులుగా తెలంగాణ స్పీకర్ గుర్తించినా కూడా చంద్రబాబు నిమ్మకు నీరెత్తలేదు. ఇంత జరుగుతున్నా ఆయన మౌనమే నా భాష అంటూ లండన్ పర్యటనకు వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తెలుగుదేశం జాతీయ పార్టీ కావాలన్న కలలు చూసి నవ్వాలో ఏడవాలో తెలియక తెలుగుదేశం శ్రేణులు సందిగ్ధంలో పడుతున్నాయి.

చూస్తుంటే చంద్రబాబునాయుడు తెలంగాణలో తెలుగు దేశం పార్టీని గాలికొదిలేసినట్లుగానే కనిపిస్తోంది. ఆ కారణం వల్లే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఒకొక్కరుగా చేజారుతున్నా ఏమి పట్టనట్లు వ్యవహరించారా?, సొంత సామాజిక వర్గ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నా, వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదా?, చివరకు టీడీపీ సభ్యులను - టీఆర్ ఎస్ విలీన సభ్యులుగా గుర్తిస్తు న్నట్లు స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై సైతం వ్యాఖ్యానిం చడానికి నిరాకరించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరుపున 15 మంది శాసనసభ్యులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒకొక్కరుగా ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడి టీఆర్ ఎస్‌ లో చేరారు. వీరంతా తమని అధికార టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ మధుసూదనాచారిని కోరుతూ లేఖ రాశారు. దీంతో ఆయన టీఆర్ ఎస్‌ లో చేరిన 12 మంది సభ్యులను విలీన సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిరాకరించడం తెలంగాణ తమ్ముళ్లే కాదు ఏపీలోని టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు వ్యవహారశైలి వల్ల పార్టీ శ్రేణులకు ఎటువంటి సంకేతాలు వెళ్తాయని ప్రశ్నిస్తు న్నారు. ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశానికి బాబు నీళ్లొదిలేశారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, దానికి మరింత ఊతమిచ్చే విధంగా ఆయన వ్యవహారశైలి ఉందని విమర్శిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి బాబు వ్యవహారశైలే కారణమని, ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి తమ్ముళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజాంకాలేజీలో జరిగిన ఎన్నికల ప్రచార శంఖారావలో బాబు ప్రసంగించిన తీరు మొదటికే మోసం తెచ్చిందన్నారు. టీఆర్ఎస్ పాలనతీరుపై, అధికార పార్టీ విధానాలపై చంద్రబాబు విరుచు కుపడుతారని భావిస్తే, ఆయన టీఆర్ ఎస్ ఊసేత్తకపోవడం వల్లే పార్టీ శ్రేణులు ముందుకొచ్చి ధైర్యంగా పని చేయలేదని, టీడీపీకి ఓటేయడం వల్ల ప్రయోజనం లేదని ప్రజలు భావించారంటున్నారు.

జీహెచ్ ఎంసీ ఎన్నికల తరువాత ఒకొక్కరుగా పార్టీ వీడుతున్నా , కనీసం వారిని నిలువరించేందుకు బాబు చొరవ చూపించకపోవడం విస్మయాన్ని కలిగిస్తోం దని అంటున్నారు. చివరకు తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం పార్టీ వీడుతారని తెలిసినా, వారిని పిలిపించుకుని మాట్లాడి, బుజ్జగించే ప్రయత్నాలేవి చేయకపోవడం చూస్తుంటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నా, లేకపోయిన ఫర్వాలేదన్నట్లుగా బాబు వ్యవహారశైలి ఉందని మండిపడుతున్నారు. చంద్రబాబు టీఆరెస్ కు, కేసీఆర్ కు భయపడుతున్నారని టీటీడీపీ నేతలు ఓపెన్ గా అనుకుంటున్నారు.