Begin typing your search above and press return to search.

'పెట్రో' దోపిడీపై చంద్రబాబు మొసలికన్నీరు

By:  Tupaki Desk   |   10 Sep 2018 7:44 AM GMT
పెట్రో దోపిడీపై చంద్రబాబు మొసలికన్నీరు
X
కథలు చెబుతారు.. కహానీలు వినిపిస్తారు.. అంతా కేంద్రమే చేసిందంటారు. కానీ ఆయన చేయాల్సింది చేయరు..కేంద్రమే చేసిందంటారు.. బీజేపీని నడిబజారులో నిలబెడతారు.. కానీ తెరవెనుక దోచుకుంటున్న తీరును మాత్రం ఆయన చెప్పరు.. చంద్రబాబు పెట్రో మాయమాటలు విని అందరూ అయ్యో పాపం అంటున్నారు... ఆయన విధిస్తున్న పెట్రో ‘వ్యాట్ ’ బాదుడు తెలిశాక చంద్రబాబును ఎవ్వరూ సపోర్ట్ చేయరనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

దేశంలో పెట్రో మంటలు చల్లారడం లేదు. బీజేపీ ప్రభుత్వం పట్టాపగ్గాలు లేకుండా పెట్రో ధరలు పెంచుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా వారిని విమర్శిస్తున్నారు. ఈరోజు పెట్రో ధరల పెంపుపై బంద్ కు బాబు మద్దతిచ్చారు. మోడీని తిట్టడానికి ఈ సందర్భాన్ని వాడుకున్నారు. కానీ లోతుగా గమనించినప్పుడు దేశంలో పెట్రోల్ పై మహారాష్ట్ర తర్వాత అత్యధిక వ్యాట్ భారం మోపుతున్నది చంద్రబాబు సర్కారే అన్న కఠిన నిజం తాజాగా బయటపడింది. ఇది చంద్రబాబు సర్కారును ఇరుకునపెట్టింది.

లీటర్ పెట్రోల్ పై దేశంలోని అన్ని రాష్ట్రాలు వ్యాట్ విధిస్తాయి. పెట్రో ధరల మంటలపై స్పందించిన రాజస్తాన్ సీఎం వసుంధర రాజె సింధియా తాజాగా దేశవ్యాప్త బంద్ నేపథ్యంలో తమ రాష్ట్రంలో వ్యాట్ ను 4శాతం తగ్గించారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.2.5 రూపాయిలు పెట్రోల్ రేటు తగ్గింది. చంద్రబాబు సర్కారు మాత్రం నెత్తి నోరు బాదుకుంటున్నా వ్యాట్ తగ్గింపును మాత్రం చేయడం లేదు.

రాజస్తాన్ లో పెట్రోల్ పై వ్యాట్ 30.80 శాతం మాత్రమే.. ఇప్పుడు 4 శాతం తగ్గారు. భారతదేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో వ్యాట్ 39.12 శాతం ఉంది. ఇక రెండో అత్యధికం ఆంధ్రప్రదేశ్ లో 38.11శాతం పన్ను ఉంది. తెలంగాణలో ఇది 33.71శాతంగా మాత్రమే ఉంది. తమిళనాట 32.16 మాత్రమే. అంటే పెట్రోల్ పై బాబు దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాజస్థాన్ బీజేపీ సర్కార్ పన్ను తగ్గించిన దరిమిలా.. కాంగ్రెస్ పాలిత కర్ణాటక, పంజాబ్ లు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఇటు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తగ్గిస్తుండగా.. చంద్రబాబు మాత్రం పెట్రోల్ ధరల మంటపై మొసలి కన్నీరు కారుస్తూ ఆ పని ఎందుకు చేయడం లేదో సమాధానం చెప్పాలని ప్రతిపక్ష వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మోడీని తిట్టడం సరే.. నీ చేతుల్లో ఉన్న వ్యాట్ తగ్గించు బాబూ అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యాట్ దోపిడీని తగ్గించడానికి బాబు మనసు అంగీకరిస్తుందో లేదో చూడాలి మరి..

దేశంలో అత్యధిక వ్యాట్ విధిస్తున్న రాష్ట్రాలు ఇవే.. (శాతాల్లో)

* మహారాష్ట్ర-39.12 శాతం
* ఆంధ్రప్రదేశ్ -38.11
*మధ్య ప్రదేశ్-35.78
*పంజాబ్ -35.12
*తెలంగాణ-33.31
*తమిళనాడు-32.16
*కర్ణాటక-30.28