Begin typing your search above and press return to search.

బాబు హుకుం!..బెజ‌వాడ సింగ‌పూర్ అయిపోవాలి!

By:  Tupaki Desk   |   15 Oct 2017 5:40 AM GMT
బాబు హుకుం!..బెజ‌వాడ సింగ‌పూర్ అయిపోవాలి!
X
ఏపీ సీఎం చంద్ర‌బాబుకు- ఎక్క‌డో ఉన్న సింగ‌పూర్ దేశానికి మ‌ధ్య ఏదో పూర్వ జ‌న్మ బంధం ఉందా? అని అంద‌రూ తెగ న‌వ్వుకుంటున్నారు. ఆయ‌న 2014లో ఏపీలో అధికారం చేప‌ట్టిన నాటి నుంచి ప్ర‌తి విష‌యాన్నీ సింగ‌పూర్‌తో ముడిపెడుతూ.. పెద్ద ఎత్తున చేస్తున్న ఆర్భాటం అంతా ఇంతాకాదు. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాల నుంచి స‌చివాల‌యం వ‌ర‌కు, విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వ్య‌వ‌సాయం వ‌ర‌కు అన్నింటినీ సింగ‌పూర్‌తోనే ముడిపెడుతున్నారు. ఏపీని సింగ‌పూర్ చేస్తానంటూ ఎక్క‌డ స‌భ పెట్టిన సంశ‌యం లేకుండా చెప్పుకొచ్చేస్తున్నారు. అంతేకాదు, సింగ‌పూర్ వ్య‌వ‌సాయం తీరే వేరంటూ.. ఆయ‌న పెద్ద ఎత్తున క్లాస్ ఇచ్చేస్తున్నారు.

అక్క‌డ డ్రిప్ ఇరిగేష‌న్ చేస్తారని, ఇక్క‌డా మ‌న రైతులు చేయాల‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇక‌, రాజ‌ధాని నిర్మాణాలు, డిజైన్ల విష‌యంలో అయితే ఈ హంగామా మ‌రింత ముదిరిపోయింది. ఆది నుంచి కూడా సింగ‌పూర్ స్టైల్లోనే నిర్మాణాలు సాగాల‌ని అక్క‌డి నిర్మాణాల‌ను తాను చూశాన‌ని చెప్పుకొచ్చారు. వీటిపై రాష్ట్ర వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా ప‌ట్టించుకోలేదు. ఇక‌, ఏడాదికి నాలుగు సార్లు సింగ‌పూర్ ట్రిప్ వేసే మ‌న సీఎం అక్క‌డి వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డిపోయారో ఏమో.. మౌలిక వ‌స‌తులు లేని, అన్నింటిలోనూ వెనుబ‌డి ఉన్న ఏపీని, ముఖ్యంగా కేంద్రంతో పోరాడి నిధులు సంపాయించుకోలేని ప‌రిస్తితిలో ఉన్న ఏపీని సింగ‌పూర్ మాదిరిగా డెవ‌ల‌ప్ చేయాల‌న‌డం హ‌స్యాస్పదం అంటున్నారు విశ్లేష‌కులు.

ఇక‌, ఇప్పుడు సీఎం సింగ‌పూర్ పిచ్చి మ‌రింత పీక్ స్టేజ్‌కి చేరిపోయింది. తాజాగా ఆయ‌న విజ‌య‌వాడ వీధుల్లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న చేశారు. దీంతో ఆయ‌న‌కు విజ‌య‌వాడ అస‌లు స్వ‌రూపం క‌నిపించింది. ఎక్క‌డికి వెళ్లినా గుంతలు ప‌డిన రోడ్లు, చెత్తా చెదారం, ట్రాఫిక్ జాంలు.. ఇలా ఒక్క‌టేమిటి అవ‌డానికి రాజ‌ధాని ప్రాంతం విశాఖ త‌ర్వాత రెండో అతిపెద్ద న‌గరం అని పేరు తెచ్చుకున్నా.. ఎక్క‌డా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సౌక‌ర్యాలూ అందుబాటులో లేవు. ఈ విష‌యాల‌ను త‌న క‌ళ్ల‌తో తానే చూసిన చంద్ర‌బాబు.. మౌలిక స‌దుపాయాల‌కు నిధులు కేటాయించాల‌న్న విష‌యాన్ని మ‌రిచిపోయారు. పోనీ.. ఈ ప‌రిస్థితిని మార్చ‌డానికి అవ‌స‌ర‌మైన ప్లాన్ సిద్ధం చేయండి అని చెప్ప‌డం కూడా మానేశారు.

అంత‌లోనే ఆయ‌న‌లో ఉన్న సింగ‌పూర్ ప్రేమికుడిని బ‌య‌ట‌కు తెచ్చారు. గుంత‌లు ప‌డిన విజ‌య‌వాడ రోడ్ల‌ను అద్దాల్లా తీర్చిదిద్దాల‌ని అధికారుల‌కు అల్టిమేటం జారీ చేశారు. అంతేకాదు, విజయవాడ రోడ్లను సింగపూర్‌ రహదారుల్లా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్క‌డా ఒక్క గుంత కూడా క‌నిపించ‌కూడ‌ద‌న్నారు. తిరిగి తాను ఎప్ప‌డైనా స‌రే ఆక‌స్మిక త‌నిఖీకి వ‌స్తాన‌ని, అప్పుడు రోడ్లు సింగ‌పూర్ రోడ్ల మాదిరిగా మెరిసిపోవాల‌ని హుకుం జారీ చేశారు. దీంతో క‌లెక్ట‌ర్ స‌హా ఉన్న‌తాధికారులు `జీ హుజూర్‌` అంటూ త‌లాడించేశారు. మొత్తానికి సీఎం సింగ‌పూర్ క‌ల‌లు మా ప్రాణాల మీద‌కి వ‌స్తున్నాయ‌ని అధికారులు నిట్టూర్చ‌డం గ‌మ‌నార్హం.