Begin typing your search above and press return to search.

బాబు వాట‌ర్ స్పోర్ట్స్ సినిమా ముచ్చ‌ట విన్నారా?

By:  Tupaki Desk   |   5 Oct 2017 5:25 AM GMT
బాబు వాట‌ర్ స్పోర్ట్స్ సినిమా ముచ్చ‌ట విన్నారా?
X
ఓప‌క్క మౌలిక వ‌స‌తులు లేక కిందా మీదా ప‌డిపోతున్నారు ఏపీ ప్ర‌జ‌లు. అయితే.. అలాంటి వాటి ప‌రిష్కారం కంటే కూడా క‌ల‌ల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆ భ‌వ‌నం.. ఈ భ‌వ‌నం అంటూ హ‌డావుడి చేసిన ఆయ‌న‌.. తాజాగా వాట‌ర్ స్పోర్ట్స్ అంటూ కొత్త క‌ల‌ను బ‌య‌ట‌కు తీశారు.

మంత్రి నారాయ‌ణ‌తో పాటు కొంత‌మంది అధికారుల‌తో క‌లిపి తాజాగా ఒక స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. త‌న వాట‌ర్ స్పోర్ట్స్ డ్రీంను బ‌య‌ట‌పెట్టి.. భారీ సినిమాను క‌ళ్ల ముందు క‌ద‌లాడేలా చేశారు. ఐదు జోన్ల‌లో రూ.10వేల కోట్ల‌తో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ప్ర‌ధాన మౌలిక వ‌స‌తులు అభివృద్ధి చేయాల‌ని డిసైడ్ చేయ‌టంతో పాటు.. అమ‌రావ‌తిలో డెవ‌ల‌ప్ చేసే స్పోర్ట్స్ సిటీ మీదా చ‌ర్చించారు.

ఒకే చోట నిర్వ‌హించేందుకు వీలుగా 20 ఎక‌రాల విస్తీర్ణంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించాల‌ని చెప్పారు. ఈ ప్రాజెక్టును చేప‌ట్టేందుకు బ్రిట‌న్ కు చెందిన స్టేడియా ఎరీనా సంస్థ ముందుకు వ‌చ్చింద‌ని.. వారం రోజుల్లో టెండ‌ర్లు పిల‌వాల‌ని ఆదేశించారు. రానున్న రెండు వారాల్లో అమ‌రావ‌తిలో రూ.13వేల కోట్ల ప‌నుల‌ను స్టార్ట్ చేయ‌నున్న‌ట్లుగా చెప్ప‌ట‌మే కాదు.. ఇప్ప‌టి నుంచి ఒక్క క్ష‌ణం కూడా నిర్ల‌క్ష్యం చేయ‌కుండా రాజ‌ధాని ప‌నులు పూర్తి చేయాల‌న్నారు.

వ‌చ్చే ఏడాది న‌వంబ‌రులో కృష్ణా న‌దిలో అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌వ‌ర్ బోట్ రేస్‌లు నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌ను బ‌య‌ట‌పెట్టారు. ఈ క్రీడ‌ల్ని నిర్వ‌హించేందుకు ఇట‌లీకి చెందిన యూఐఎం సంస్థ ముందుకొచ్చిన‌ట్లుగా బాబు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆ సంస్థ‌లో ఏపీ ప్ర‌భుత్వం ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. హెచ్‌2ఓ రేసింగ్ పేరుతో ప‌వ‌ర్ బోట్ రేసింగ్‌.. ఎఫ్‌1హెచ్‌2ఓ పేరుతో బోటు రేసింగ్ లో ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్‌.. ఆక్వాబైక్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ ల‌ను నిర్వ‌హిస్తామ‌ని స‌ద‌రుసంస్థ ప్ర‌తినిధులు బాబుతో చెప్పారు. అమ‌రావ‌తిలోని సానుకూల వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో చైనా.. ఫ్రాన్స్‌.. యూఏఈ త‌ర్వాత ఈ పోటీల నిర్వ‌హ‌ణ‌కు అమ‌రావ‌తిని ఒక స‌ర్క్యూట్‌ గా తీసుకున్న‌ట్లుగా స‌ద‌రు యూఐఎం సంస్థ ప్ర‌తినిధులు చెబుతున్నారు. బాబు క‌ల‌ల‌కు త‌గ్గ‌ట్లే బాజా మోగిస్తున్న యూఐఎం సంస్థ ప్ర‌తినిధులు ఎంత‌మేర చెప్పిన మాట‌ల్ని చేత‌ల్లో చేసి చూపిస్తారో చూడాలి. 40 దేశాల్లో పోటీల నిర్వ‌హ‌ణ‌ను స‌మ‌ర్థ‌వంతంగా యూఐఎం సంస్థ నిర్వ‌హిస్తోంద‌ని.. అమ‌రావ‌తిలో జ‌రిగే పోటీల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం పైసా ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు. మ‌రెలాంటి ప్ర‌యోజ‌నం లేకుండానే ఈ విదేశీ సంస్థ అమ‌రావ‌తికి వ‌స్తుందా? అన్న‌ది సందేహ‌మే. మ‌రి.. ఈ సంస్థ నిర్వ‌హిస్తామ‌ని చెబుతున్న పోటీల కోసం ప్ర‌భుత్వం ఏయే విష‌యాల్లో క‌మిట్ అయ్యిందో బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.