Begin typing your search above and press return to search.

కడపలో వైఎస్సార్ పేరు కనిపించదా...?

By:  Tupaki Desk   |   11 Oct 2015 8:50 AM GMT
కడపలో వైఎస్సార్ పేరు కనిపించదా...?
X
ఒకప్పుడు ఆ జిల్లా పేరు కడప... ఆ తరువాత వైయస్సార్ కడపగా మారింది.... మళ్లీ ఇప్పుడా జిల్లా పేరు కడపగానే మారబోతుందా... వైఎస్సార్ పేరును తొలగించనున్నారా ? ప్రస్తుతం ఏపీలో.. ప్రత్యేకించి రాయలసీమలో ఈ చర్చ జోరుగా సాగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా పేరును మళ్లీ కడపగానే మార్చాలని మొన్నటి మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందన్న విషయం బయటకు రావడంతో ఇది చర్చనీయాంశమవుతోంది.

వైఎస్సార్ కడప జిల్లా పేరును కడపగానే ఉంచాలని ఏపీ మంత్రివర్గం అభిప్రాయపడింది. అయితే, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం పూర్తిస్థాయిలో అంగీకరించలేదు... అనవసరంగా రచ్చ చేసుకోవడం ఎందుకన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తీకరిస్తూ మంత్రుల మాటను కొట్టిపారేయలేక.. దీనిపైన ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని అన్నారు. శనివారం నాటి కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. వైఎస్సార్‌ కడప జిల్లా పేరును తిరిగి కడప జిల్లాగా మార్చాలని మంత్రి అచ్చెన్నాయుడు లేవనెత్తారు. దేవుని గడప పేరుతో కడప అనే పేరు వచ్చిందని, దేవుడి పేరున ఏర్పడిన జిల్లా పేరును వైయస్సార్ కడప జిల్లాగా మార్చడం సరికాదన్నారు. అయితే దీనిపై ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

జిల్లా పేరులో వైఎస్ పేరును తొలగిస్తే కక్ష సాధింపులా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం... అందుకే ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్దామని ఆయన అన్నారని తెలుస్తోంది. చంద్రబాబు మాటల ప్రకారం చూస్తే ఆయన ఈ పేరు తొలగింపును అంతగా పట్టించుకోవడం లేదని... తొలగించకపోవచ్చని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కొందరు మంత్రులు మాత్రం అత్యుత్సాహంతో ఈ ప్రతిపాదనను బలపరుస్తున్నారు.