Begin typing your search above and press return to search.

బాబోయ్‌.. బాబు మ‌ళ్లీ మొద‌లెట్టాడు!

By:  Tupaki Desk   |   16 Dec 2017 9:54 AM GMT
బాబోయ్‌.. బాబు మ‌ళ్లీ మొద‌లెట్టాడు!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నోరు తెరిస్తే గొప్ప‌లే గొప్ప‌లు. ప్రొగ్రామ్ ఏదైనా - సంద‌ర్భం ఏదైనా కూడా బాబుకు అవ‌స‌రం లేదు. తాను అనుకున్న‌ది - తాను సాధించాననుకున్న విష‌యాల‌ను ఏమాత్రం మొహ‌మాటం లేకుండా ప్ర‌స్తావించేసే చంద్ర‌బాబు... తాను అది చేశాను, ఇది చేశాను అంటూ త‌న‌దైన శైలిలో చెప్పుకుపోతుండ‌టం మ‌న‌కు కొత్తేమీ కాదు. గ‌తంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న స‌మ‌యంలో తాను ఏం చేశారన్న విష‌యాల‌ను ఆయ‌న ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్న విష‌యం జ‌నాల‌కు కాస్తంత ఇబ్బందేన‌ని చెప్పాలి. అస‌లు హైద‌రాబాదు ఇలా ఉందంటే... అది త‌న పుణ్య‌మేన‌ని కూడా చెప్పుకునే చంద్ర‌బాబు... ఆ విష‌యాలు చెబుతున్న‌ప్పుడు ఏమాత్రం ఆయ‌న సిగ్గుప‌డ‌ర‌న్న విష‌యం కూడా ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. అయితే గ‌త‌మంతా ఘ‌నం... వ‌ర్త‌మానంలో ఏం చేస్తున్నామ‌న్న విష‌యాన్ని చెప్పేందుకు బాబు మ‌రింత ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు.

అయినా ఇప్పుడిదంతా ఎందుకంటే... సాగ‌ర న‌గ‌రం విశాఖ కేంద్రంగా నేటి ఉద‌యం టెక్‌-2017 పేరిట ఓ టెక్ స‌ద‌స్సు ప్రారంభ‌మైంది. ఈ సద‌స్సులో ప్రారంభోప‌న్యాసం చేసిన చంద్ర‌బాబు... మ‌ళ్లీ త‌న‌లోని పాత మ‌నిషిని బ‌య‌ట‌కు తెచ్చారు. త‌న ఉప‌న్యాసంలో తొలుత హైద‌రాబాదును, ఆ న‌గ‌రానికి ప్ర‌పంచ ప‌టంలో మంచి గుర్తింపు తెచ్చిన తన గురించి బాబు మ‌రోమారు గొప్ప‌లు చెప్పుకున్నారు. హైద‌రాబాదును టెక్నాల‌జీ న‌గ‌రంగా తీర్చిదిద్దింది తానేన‌ని, తాను ప‌దేళ్లు సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే ఈ అభివృద్ధి మొత్తం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌పంచంలోనే పేరెన్నిక‌గ‌న్న సంస్థ‌లు మైక్రోసాఫ్ట్‌ - గూగుల్ వంటి సంస్థ‌ల‌ను హైద‌రాబాదుకు ర‌ప్పించింది కూడా తానేన‌ని ఆయ‌న చెప్పుకున్నారు. ఈ సంస్థ‌లు హైద‌రాబాదుకు రాక‌మునుపే తాను అమెరికా అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్‌ ను హైద‌రాబాదుకు ర‌ప్పించాన‌న్నారు. అస‌లు హైద‌రాబాదు విశ్వ న‌గ‌రంగా ఎదిగిందంటే... అందుకు త‌న కృషే కార‌ణ‌మ‌ని చంద్ర‌బాబు త‌న‌దైన స్టైల్లో ఓ స్టేట్ మెంట్ ప‌డేశారు.

ఈ విష‌యాల‌తోనే దాదాపుగా సుదీర్ఘ ప్ర‌సంగం చేసిన చంద్ర‌బాబు... చివ‌ర‌గా రాజ‌ధాని కూడా లేకుండా ఏర్పాటైన ఏపీని ఏ రీతిన అభివృద్ధి చేయ‌నున్నామ‌న్న విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ఏపీని నాలెడ్జ్ హ‌బ్‌ గా తీర్చిదిద్దడ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. ఈ దిశ‌గా ఇప్ప‌టికే చాలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌తో ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు పోటెత్తుతున్నాయ‌ని కూడా చెప్పారు. స‌మీప భ‌విష్య‌త్తులోనే ఏపీ నాలెడ్జ్ హ‌బ్‌ గా మారిపోతుంద‌ని కూడా చంద్ర‌బాబు ఘ‌నంగా ప్ర‌క‌టించుకున్నారు. ఇక టెక్నాల‌జీ అప్‌ డేట్స్‌ లోకి వ‌చ్చేసిన చంద్ర‌బాబు... ఆ విష‌యాన్ని కూడా త‌న‌దైన స్టైల్లో వివ‌రించారు. ఐటీతో ప్రపంచం గ్లోబల్ విలేజ్‌ గా మారిందని, ఇప్పుడు ఐవోటీ విప్లవం నడుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. యువరక్తం - ఆంగ్ల భాషా నైపుణ్యం మనకు ప్లస్ పాయింట్ అని - నవ్యాంధ్రను గేమింగ్ - యానిమేషన్ హబ్‌ గా మారుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అయినా రాజ‌ధాని లేక నానా ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిపాన‌న‌ను త‌క్ష‌ణ‌మే గాడిన పెట్టాల్సిన చంద్ర‌బాబు.. గ‌తంలో ఎన్నో చేశాం - ఇప్పుడు కూడా ఎంతో సాధించాం అని చంద్ర‌బాబు చెప్పిన తీరు... నిజంగానే బ‌డాయి బాబును ఆవిష్క‌రించేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.