Begin typing your search above and press return to search.

బాబు మాట : లేటుగా పేలిన తూటా!

By:  Tupaki Desk   |   17 Feb 2018 11:49 AM GMT
బాబు మాట : లేటుగా పేలిన తూటా!
X
చంద్రబాబునాయుడు ఇవాళ బహిరంగ వేదిక మీద తొలిసారిగా తన మనసులోని క్షోభను బయటపెట్టారు. కానీ ఇప్పటికే కొన్ని పదుల సార్లు ఆయన పార్టీ సీనియర్లతో సమావేశాల్లో ఇదే మాట చెప్పారు. ఆయన వందిమాగధులందరూ.. అదేదో తమ నాయకుడి ఘనత అయినట్టుగా తమ తమ ప్రసంగాల్లో అదే మాటను కొన్ని వందల సార్లు రిపీట్ చేసి ప్రజలకు కంఠతా వచ్చేలాగా చేసేశారు. ఇంతకూ ఆ మాట ఏంటంటే.. ‘చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం 29 సార్లు ఢిల్లీ వెళ్లారు.. అయినా కేంద్రం స్పందించడం లేదు.’! రాష్ట్రంలో ఈ మాట తెలియని వారు ఉండరు.

అవునుగానీ.. ఇక్కడో సందేహం వస్తోంది. నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, దేశంలోనే తనను మించిన సీనియారిటీ అనుభవం ఉన్న నాయకుడు వేరే లేరని చెప్పుకునే నేత, పవన్ కల్యాణ్ లాంటి హీరోలతో కూడా.. తనలాంటి నాయకుడి అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం అని పొగిడించుకునే చంద్రబాబునాయుడు.. 29 పర్యటనలు చేసినతర్వాత.. కేంద్రంలోని పెద్దల వైఖరి ఎలా ఉంటున్నదో అర్థం చేసుకోలేకపోయారా? వారు రాష్ట్రానికి సాయం చేసే ఉద్దేశంతో లేరని.. బడ్జెట్ లో అన్యాయం చేసేదాకా వారికి అర్థం కాలేదా?

ప్రజలు వెర్రివాళ్లని తాను ఏం చెబితే దాన్ని నమ్ముతారని చంద్రబాబునాయుడు అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బడ్జెట్ నేపథ్యంలో ప్రతిష్టంభన ఏర్పడిన తరువాత తొలిసారి బహిరంగంగా పెదవి విప్పిన చంద్రబాబునాయుడు.. రాష్ట్రం కోసం ఏం చేయడానికైనా తాము సిద్ధం, ప్రాణత్యాగాలకు కూడా తాము సిద్ధం అని ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి ప్రగల్భాల డైలాగుల వల్ల ఉపయోగం ఏమిటో ప్రజలకు మాత్రం అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రజలు ఆయన చేతిలో అధికారం పెడితే.. వారందరి ప్రతినిధిగా ఏ సమయంలో ఎలా స్పందించాలో.. అలా స్పందంచకుండా.. ఇప్పుడు నాలుగేళ్లూ గడచిపోయాక.. చివరి బడ్జెట్ కూడా రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించాక.. ఇప్పుడిక కేంద్రం మీద నిందలు వేస్తే ప్రజలు నమ్ముతారా? 29 సార్లు కేంద్రం చుట్టూ తిరిగిన చంద్రబాబు అన్నిసార్లూ వాళ్ల ద్వారా సాయం వస్తుందనే నమ్మారా? అలా అని ఆయన గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆ సమయంలో అలా నమ్మానని ఆయన చెబితే గనుక.. ఇంతటి అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి రాష్ట్రాధినేతగా ఒక్కరోజు కూడా కొనసాగడానికి పనికి రాడని ప్రజలు అనుకోవాలి. ఒకవేళ వారి వైఖరి ఎప్పుడో అర్థమైందని.. కానీ ఇన్నాళ్లూ ఓపిక పట్టానని అంటే గనుక.. ఇన్నాళ్లుగా ప్రజల్ని తను కూడా వంచిస్తూ.. వారి ముందు ఎందుకు మోకరిల్ల వలసి వచ్చిందో ఆయన తెలుగుజాతికి వివరణ ఇవ్వాలి. సభలో మైకులు కనిపించగానే.. ప్రత్యర్థి పదవుల త్యాగాల ప్రకటనతో మైలేజీ పొందుతున్నాడనే దుగ్ధ గుర్తుకురాగానే.. తాము ప్రాణత్యాగాలైనా చేస్తామనే బూటకపు మాటలు ప్రజలకు అనవసరం. ఇది పొట్టి శ్రీరాములు కాదు. ప్రజలు అంత అజ్ఞానంలోనూ మగ్గడం లేదు. వారు కోరుకుంటున్నది ఒక్కటే.. ఇప్పటికైనా మీరు చెప్పుకునే అనుభవాన్ని బయటకు తీయండి.. పోరుబాట పట్టండి.. అందరినీ కలుపుకుపొండి.. రాష్ట్రానికి ముందు మేలు జరగనివ్వండి.. ఆ తర్వాత మీలో మీరు కొట్టుకోండి. అంతే తప్ప.. ఇలా వక్రదృష్టితో వ్యవహరించడం కరెక్టు కాదు అని ఆశిస్తున్నారు.