Begin typing your search above and press return to search.

ఓటే వేయ‌కుంటే సిగ్గు ప‌డ‌టం ఏంది బాబు?

By:  Tupaki Desk   |   2 Jan 2018 5:20 AM GMT
ఓటే వేయ‌కుంటే సిగ్గు ప‌డ‌టం ఏంది బాబు?
X
అధికారంలో చేతిలో ఉన్నంత‌నే ఆకాశంలో నుంచి దిగి వ‌చ్చిన ఫీలింగ్ కొంద‌రు అధినేత‌ల‌కు అనిపిస్తూ ఉంటుంది. ప‌వ‌ర్ చేతిలో ఉన్న‌ప్పుడు వ‌చ్చే ధీమా మామూలే అయినా.. అదెప్పుడు హ‌ద్దులు దాట‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. ఆ విష‌యాన్ని మ‌ర్చిపోతేనే అస‌లు ఇబ్బంది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌ను తాను కంట్రోల్ చేసుకోవ‌టంలో చాలా సంద‌ర్భాల్లో క‌ట్టుత‌ప్పుతారు.

కాన్ఫిడెన్స్ స్థానంలో వ‌చ్చే ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో ఆయ‌న చేసే వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు శాపాలుగా మార‌టం తెలిసిందే. ప‌వ‌ర్ లో లేన‌ప్పుడు తాను గ‌తంలో మాట్లాడిన మాట‌ల విష‌యంలో విచారం వ్య‌క్తం చేసే బాబు.. ప‌వ‌ర్ చేతిలో ఉన్న‌ప్పుడు మాత్రం గ‌తాన్ని మ‌ర్చిపోతుంటారు. తాజాగా మ‌రోసారి అలాంటి తీరునే ప్ర‌ద‌ర్శించారు.

కొత్త సంవ‌త్స‌రం వేళ‌.. స‌రికొత్త‌గా మాట్లాడాల‌న్న ప్ర‌య‌త్న‌మో.. ఏమో కానీ.. రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓటు వేయ‌క‌పోవ‌టం ఎంత పెద్ద త‌ప్పో చెప్పే క్ర‌మంలో బాబు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓటు వేయ‌క‌పోతే ప్ర‌జ‌లే సిగ్గుప‌డాలంటూ స‌రికొత్త రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు.

ప్ర‌పంచంలో ఏ నాయ‌కుడు కూడా ఆలోచించ‌ని రీతిలో చంద్ర‌బాబు ఆలోచించ‌టం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఎక్క‌డా.. ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ప్ర‌జలంతా త‌నకే ఓటు వేయాల‌ని.. అలా వేయ‌కుంటే ప్ర‌జ‌లే సిగ్గుప‌డాల‌ని వ్యాఖ్యానించే వారు క‌నిపించ‌రు. కానీ.. అలాంటి చిత్ర‌మైన వ్యాఖ్య చేశారు చంద్ర‌బాబు.

తాము చేసిన ప‌నుల‌కు ప్ర‌జ‌లు ఆటోమేటిక్ గా అన్ని సీట్లు గెలిపించాల‌న్న చంద్ర‌బాబు.. ఒక‌వేళ ఒక‌టి..రెండు సీట్లు గెలిపించ‌క‌పోతే ఎందుకు గెలిపించ‌లేదో ప్ర‌జ‌లే ఆలోచించుకోవాలంటూ భారీ డైలాగులు చెప్పేస్తున్నారు. త‌మ‌కు ఓట్లు వేయ‌ని ప్ర‌జ‌లు.. తాము త‌ప్పు చేశామ‌ని సిగ్గుప‌డే పరిస్థితి రావాల‌న్న వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

అన్నీ చేసిన త‌ర్వాత త‌న‌కు ఎందుకు ఓటు వేయ‌ర‌ని.. ఇంకా ఏం కావాల‌ని ప్ర‌జ‌ల్ని ప్ర‌శ్నించారు. త‌న క‌ష్టానికి కూలి ఇవ్వాల‌న్న చంద్ర‌బాబు.. న‌దుల అనుసంధానం కోసం తాను తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లుగా చెప్పారు. గ‌డిచిన మూడున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో తాను చాలా చేసిన‌ట్లుగా చెప్పుకుంటున్న చంద్ర‌బాబును ఒకే ఒక్క సూటిప్ర‌శ్న. బాబు వ‌స్తే ప్ర‌తి ఇంటికి జాబు ప‌క్కా అన్న చంద్ర‌బాబు.. మూడున్న‌రేళ్ల‌లో త‌న మాట‌ను ఎంత‌వ‌ర‌కు అమ‌లు చేశారు? దీనికి స‌మాధానం చెప్పిన త‌ర్వాత‌.. తానేం చేశానో బాబు చెబితే బాగుంటుంది.