Begin typing your search above and press return to search.

'జ‌మిలి' పై బాబు మాటేంటో?

By:  Tupaki Desk   |   30 Jan 2018 5:03 AM GMT
జ‌మిలి పై బాబు మాటేంటో?
X
దేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఓ కొత్త ప్ర‌తిపాద‌నను ముందుకు తీసుకొచ్చారు. ఇది కొంగొత్త ప్ర‌తిపాద‌న ఏమీ కాకున్నా... చాలా ఏళ్ల కింద‌ట అమ‌లైన‌దే అయినా... ఇప్పుడు తెర మీద‌కు రావ‌డం నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ప్ర‌ధాని హోదాలో ఎర్ర‌కోట‌పై నుంచి ప్ర‌సంగించిన సంద‌ర్భంగా ఇటీవ‌లే ప్ర‌ధాని ఈ ప్ర‌తిపాద‌న‌ను తీసుకొచ్చారు. అదే జ‌మిలి ఎన్నిక‌లు. దేశంలో లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఏక‌కాలంలో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించే ప‌ద్ద‌తినే మ‌నం జమిలి ఎన్నిక‌లుగా పిలుచుకుంటున్నాం. చాలా ఏళ్ల క్రితం మ‌న దేశంలో ఈ ప‌ద్ద‌తి అమ‌లైంది. అయితే ఆయా రాష్ట్రాల ప‌రిస్థితులు, కేంద్రంలోని ప్ర‌భుత్వాలు తీసుకున్న కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ ప‌ద్ద‌తి క‌నుమ‌రుగైంది. అస‌లు జ‌మిలి ఎన్నిక‌లు జ‌రిగితే.. మ‌రో ఐదేళ్ల పాటు దేశంలో ఏ ఒక్క చోట కూడా ఎన్నిక‌ల‌న్న ప్ర‌స్తావ‌నే రాదు. వెర‌సి ఎప్ప‌టిక‌ప్పుడు దేశంలోని ఏదో ఒక చోట ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం, అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీతో పాటు ఆయా ప్రాంతాల‌కు చెందిన రాష్ట్ర ప్ర‌భుత్వాలు హామీలు గుప్పించ‌డం, ప్యాకేజీలు ప్ర‌క‌టించ‌డం త‌ప్ప‌దు క‌దా. అంతేకాకుండా ఎన్నిక‌ల వేళ అమ‌ల్లోకి వ‌చ్చే ఎల‌క్ష‌న్ః కోడ్ కార‌ణంగానే చాలా ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇక పోలీసు భ‌ద్ర‌త‌, ఎన్నిక‌ల యంత్రాంగం నియామ‌కం - పోలింగ్‌ - కౌంటింగ్ త‌దిత‌రాల‌న్నింటికీ అయ్యే ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌వుతోంది.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన మోదీ... దేశంలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగిపోయిన ఎన్నిక‌ల ఖ‌ర్చును త‌గ్గించుకునేందుకు జమిలి ఎన్నిక‌లు ఒక్క‌టే మార్గ‌మ‌ని చెప్పారు. అంతేకాకుండా దేశంలో నిరంత‌రాయంగా అభివృద్ధి సాగాలంటే కూడా జ‌మిలి ఎన్నిక‌లే మార్గ‌మ‌ని కూడా ఆయ‌న త‌న‌దైన వాణిని వినిపించారు. ప్ర‌ధాని హోదాలో మోదీ చేసిన ఈ ప్రతిపాద‌న‌కు దేశంలోని దాదాపు అన్ని రాజ‌కీయ పార్టీలు కూడా స‌రేన‌న్నాయి. ఒక‌టి అరా రాష్ట్ర ప్ర‌భుత్వాలు మిన‌హా మెజారిటీ రాష్ట్ర ప్ర‌భుత్వాలు జ‌మిలి పోల్స్ మంచివేన‌ని కూడా అభిప్రాయ‌ప‌డ్డాయి. మోదీ గ‌నుక జ‌మిలి బాట ప‌డితే... తాము కూడా ఆయ‌న వెంటే న‌డుస్తామ‌ని కూడా విస్ప‌ష్టంగానే ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో నిన్న జ‌రిగిన ఎన్డీఏ విస్తృత స్థాయి భేటీలో ప్ర‌ధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. జ‌మిలి ఎన్నిక‌ల‌కు ఎన్డీఏలోని అన్ని భాగ‌స్వామ్య‌ప‌క్షాలు సిద్ధం కావాల్సి ఉంద‌ని, ఇందులో ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే తెలియ‌జేయాల‌ని, నిర్ణ‌యం ఏదైనా అభిప్రాయాలు మాత్రం త్వ‌రగానే రావాల‌ని ఆయ‌న అన్ని పార్టీల నేత‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ స‌మావేశానికి ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వామి అయిన టీడీపీ త‌ర‌ఫున కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి - లోక్ స‌భ‌లో టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ఉన్న తోట న‌రసింహం హాజ‌ర‌య్యారు. భేటీ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన సుజ‌నా మీడియాతో మాట్లాడుతూ... జ‌మిలి ఎన్నిక‌ల సాధ్యాసాధ్యాల‌పై త‌మ నిర్ణ‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని, త‌మ పార్టీ అధినేత‌గా ఉన్న ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడును అడిగి ఈ విష‌యంపై త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

జ‌మిలి ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబు గ‌తంలో సానుకూలంగానే స్పందించారు. దేశంలో లోక్ స‌భ‌తో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఒకే ద‌ఫా ఎన్నిక‌లు జ‌రిగితే... నిజంగానే ఐదేళ్ల పాటు అభివృద్ధికి ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని, ఎన్నిక‌ల‌న్న భ‌య‌మే లేకుండా పాల‌న సాగించ‌వ‌చ్చ‌ని చెబుతూ... జ‌మిలీపై మోదీ చేసిన ప్ర‌తిపాద‌న‌ను స్వాగ‌తించారు. ఈ విష‌యంపై త‌మ‌ను అడిగితే... జ‌మిలికి తాము సిద్ధ‌మేన‌ని చెబుతామ‌ని కూడా నాడు బాబు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది క‌దా. మిత్ర‌ప‌క్షాలుగానే ఉన్న బీజేపీ - టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. మొన్న‌టిదాకా అటు బీజేపీ నేత‌లు, ఇటు టీడీపీ నేత‌లు మాట‌ల తూటాలు పేల్చుకుంటే... పెద్ద మ‌నిషిగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు ఇరు పార్టీల నేత‌ల‌ను స‌ముదాయించారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితులు భ‌విష్య‌త్తులో త‌లెత్త‌కూడ‌ద‌న్న భావ‌న‌తో ఏకంగా ఇరు పార్టీల‌కు చెందిన ముఖ్య నేత‌ల‌తో స‌మ‌న్వ‌య క‌మిటీ భేటీలు కూడా నిర్వ‌హించారు. అయితే మొన్న దావోస్ నుంచి వ‌చ్చీరాగానే... బీజేపీ త‌మ‌తో మైత్రి వ‌ద్ద‌నుకుంటే న‌మ‌స్కారం పెట్టేసి త‌ప్పుకుంటామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ కూడా భారీగానే స్పందించింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు బీజేపీ - టీడీపీ మ‌ధ్య స‌యోధ్య ప్ర‌మాదంలో ప‌డిపోయింద‌నే చెప్పాలి. ఇలాంటి పరిస్థితులున్న ప్ర‌స్తుత త‌రుణంలో జ‌మిలీపై మోదీ తీసుకున్న నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబు స్వాగ‌తిస్తారా? అన్న ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. మొత్తానికి జ‌మిలీపై బాబు ఎలా స్పందిస్తార‌న్న విష‌యం ఇప్పుడు నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారిపోయింద‌నే చెప్పాలి. చూద్దాం... బాబు నోట జ‌మిలీపై ఎలాంటి మాట వినిపిస్తుందో?