Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిపై కేంద్రంతో తేల్చుకోనున్న బాబు

By:  Tupaki Desk   |   12 Feb 2016 6:43 AM GMT
అమ‌రావ‌తిపై కేంద్రంతో తేల్చుకోనున్న బాబు
X
ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన అమ‌రావ‌తి నిర్మాణం అంశం విష‌యంలో కేంద్రంతో దూకుడుగా వెళ్లేందుకు సిద్ధ‌ప‌డ్డారా? కేంద్రం నో చెప్తున్న‌ప్ప‌టికీ త‌న‌దైన‌శైలిలో లాబీయింగ్‌ - ఆధారాల‌తో ముందుకు వెళుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

రాజధాని ప్రాంతంలో అటవీ భూముల డీనోటిఫైకి మరోసారి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్ర‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్‌ డీఏ పరిధిలో సుమారు లక్ష ఎకరాల అట‌వీ భూమిని అభివృద్ధి చేసేందుకు డీనోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి గతంలో నివేదిక అందజేసింది. స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర అటవీ - పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ను కోరారు. దీనిపై సమగ్ర సమాచారాన్ని అందించాలని అప్పట్లో కేంద్రమంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించే ముందు సర్వే నిర్వహించాల్సి ఉంది. ఇందుకు రెండు నెలల వ్యవధి పడుతుంది. అయితే వీలైనంత త్వరలో రాజధాని నిర్మాణం చేపట్టేందుకు ల్యాండ్‌ బ్యాంక్‌ ను సిద్ధం చేసుకుంటున్న ప్రభుత్వం కృష్ణా - గుంటూరు జిల్లాల్లో అటవీ భూములను ఉటంకిస్తూ డీనోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరింది.

అయితే సర్వే నిర్వహించనందున రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం తిరస్కరించింది. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంత పెద్దమొత్తంలో భూములు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. మరోసారి దీనిపై పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించాలని కోరింది. దీంతో కనీసం 50వేల ఎకరాలయినా ముందు డీనోటిఫై చేస్తే రాజధాని అవసరాలు తీరతాయని.. ఇందుకు తగిన సర్వే నిర్వహించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్‌ డిఏ అధికారులను ఆదేశించారు. సీఎం తన నివాసంలో మంత్రి నారాయణ - సీఆర్‌ డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌ తో సమావేశమయి కృష్ణా - గుంటూరు జిల్లాల్లో రాజధాని అమరావతి నగరానికి చేరువలో ఉన్న అటవీ భూములను గుర్తించాలని ఆదేశించారు. గుంటూరు జిల్లాలో నీరుకొండ - కృష్ణాజిల్లాలో ఇబ్రహీంపట్నం - కొండపల్లి అటవీ భూములలో సర్వే నిర్వహించి అవసరమైతే జియో ట్యాగింగ్‌ చేయాలని సీఎం సూచించారు. వచ్చే నెలాఖరులోగా సర్వే పూర్తిచేసి తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. మరో నాలుగురోజుల్లో అటవీ భూముల డీనోటిఫైకి సంబంధించి సీఆర్డీఏ అధికారులతో సమావేశం కానున్నారు.