Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు దుబాయ్ నుంచి బాబు ఆదేశ‌మిదే

By:  Tupaki Desk   |   9 Feb 2018 5:49 AM GMT
త‌మ్ముళ్ల‌కు దుబాయ్ నుంచి బాబు ఆదేశ‌మిదే
X
ప్ర‌స్తుతం దుబాయ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌.. ఏపీకి ఏం చేయ‌లేద‌న్న అస‌మ‌ర్థ‌త‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ప‌డుతున్న తిప్ప‌లు అన్నిఇన్ని కావు. గ‌డిచిన నాలుగేళ్లుగా ఏదో ఒక‌టి చెప్పి త‌ప్పించుకుంటున్న బాబు బ్యాచ్ కు.. ఏపీ ప్ర‌జ‌ల ఆగ్ర‌హం ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

మిత్రుడు మోడీని మెప్పించ‌టంలో విఫ‌ల‌మైన బాబు.. పుణ్య కాలం గ‌డిచే దాకా వెయిట్ చేసి.. ఇప్పుడు హ‌డావుడి చేస్తున్న వైనాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. మోడీ స‌ర్కారు చివ‌రి పూర్తిస్థాయి బ‌డ్జెట్ ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికీ కామ్ గా ఉండిపోయార‌ని.. బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగిసిన త‌ర్వాత కూడా ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించారు బాబు. బ‌డ్జెట్ లో ఏపీకి కేటాయింపులు లేక‌పోవ‌టం.. విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌టంపై ఆంధ్రోళ్లు ఆగ్ర‌హం చెంద‌టం.. ఈ విష‌యంపై రియాక్ట్ కాకుంటే రాజ‌కీయంగా న‌ష్ట‌మ‌న్న విష‌యాన్ని గుర్తించిన చంద్ర‌బాబు.. ఇప్పుడు ఆందోళ‌న బాట ప‌డుతున్నారు.

బ‌డ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపించిన వైనంపై మొద‌ట్లో క‌స్సుమ‌న్న చంద్ర‌బాబు.. ఆ త‌ర్వాత కాస్త త‌గ్గిన‌ట్లు క‌నిపించారు. అయితే.. వెన‌క‌డుగు వేస్తే.. మొత్తంగా మునిగిపోతామంటూ అందుతున్న సంకేతాల‌తో త‌మ్ముళ్ల‌ను దూసుకెళ్లల‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం దుబాయ్ లో ఉన్న చంద్ర‌బాబు.. పార్ల‌మెంటులో త‌మ పార్టీ ఎంపీలు ఎలా ఉండాల‌న్న అంశంపై ఆదేశాలు జారీ చేశారు.

పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం నుంచి మోడీ స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న త‌మ్ముళ్ల‌ను మ‌రింత స్పీడ్ పెంచాల‌న్న సూచ‌న‌ను చంద్ర‌బాబు చేసిన‌ట్లు చెబుతున్నారు. ఏపీకి ఇచ్చిన హామీల‌పై ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ రెండుసార్లు ప్ర‌క‌ట‌న చేసినా.. అందులో ఏమీ లేని నేప‌థ్యంలో తమ్ముళ్ల‌ను చెల‌రేగిపోవాల‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

దుబాయ్ నుంచి త‌మ్ముళ్ల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన బాబు.. కేంద్ర ప్రభుత్వం త‌ర‌ఫున త‌న‌తో మాట్లాడేవారు.. అన్ని చేసేస్తామ‌ని చెబుతున్నార‌ని.. కానీ వాస్త‌వం మాత్రం అందుకు భిన్నంగా ఉంద‌ని చెప్పారు. మూడు రోజుల నుంచి ఏపీ అధికారులు ఢిల్లీలో కూర్చొని కేంద్రంతో మాట్లాడుతున్నార‌ని.. ఇలాంటి వేళ జైట్లీ చేసిన రెండు ప్ర‌సంగాల్లోనూ ఎలాంటి ప్ర‌భావం లేక‌పోవ‌టంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

జ‌రిగిన అన్యాయంపై వెన‌క‌డుగు వేసేది లేద‌ని.. పోరాటాన్నికొన‌సాగించాల‌ని చెప్ప‌టంతో పాటు..కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు చెబుతున్నారు. రాష్ట్రానికి సాయం చేయ‌టానికి నిధులు లేవ‌న్న జైట్లీ మాట‌ల్ని త‌ప్పు ప‌ట్టిన చంద్ర‌బాబు.. రాష్ట్రాన్ని విభ‌జించే స‌మ‌యంలో ఆ ప్ర‌శ్న‌లు ఎందుకు వేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. సాయం కోసం బీజేపీ నేత‌ల‌తో మాట్లాడుతున్న‌ప్పుడు ఒక‌రి ద‌గ్గ‌రికి వెళితే మ‌రొక‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌మంటూ తిప్పు తున్నారంటూ సుజ‌నా చౌద‌రి లేవ‌నెత్తి అంశంపై ఆగ్ర‌హం చెందిన చంద్ర‌బాబు.. బీజేపీ నేత‌ల తీరు ఏ మాత్రం బాగోలేద‌ని.. నిర‌స‌న‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఆపొద్ద‌ని.. మ‌రింత ఉధృతం చేయాల‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.