Begin typing your search above and press return to search.

ఎవరో చెబితే పదవులు ఇచ్చేస్తారా బాబు?

By:  Tupaki Desk   |   10 Dec 2016 6:07 AM GMT
ఎవరో చెబితే పదవులు ఇచ్చేస్తారా బాబు?
X
‘‘పదవులు చెట్లకు కాసే కాయలా?సూపర్ మార్కెట్లో దొరికే వస్తువులా?’’ అంటూ అధినేతలు పదవుల కోసం చెప్పులు అరిగిపోయేలా తిరిగే వారిని ఉద్దేశించి అధినేతలు అప్పుడప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. కానీ.. వారి కరుణాకటాక్షాలు ఉండాలే కానీ.. ఎలాంటి వాడికైనా.. ఎలాంటి పదవైనా ఇట్టే దక్కుతుంది. జనాల బ్యాడ్ లక్ ఏమిటంటే.. పదవుల పంపకాలప్పుడు ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలి? వారికిచ్చే పదవికి వారు న్యాయం చేస్తారా? లేదా? అన్నది కూడా చూడకుండా.. ఎవరో చెప్పారని పదవులు ఇచ్చేయటం లాంటివి జీర్ణించుకోవటం కష్టం.

చేసిన తప్పును.. బయటకు చెప్పటం ఒక ఎత్తు అయితే.. దాన్ని సమర్థించుకునేలా మాట్లాడటం మరో ఎత్తు. అలాంటి విషయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త ముందుంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డి ఉదంతం ఎంత సంచలనం రేపుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓపక్క నాలుగైదు వేల కోసం బ్యాంకుల వద్ద గంటల కొద్దీ క్యూలో నిలుచోవాల్సిన దుస్థితి ఉంటే.. ఈ టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి దగ్గర మాత్రం ఏకంగా రూ.150 కోట్లు విలువ చేసే కొత్త నోట్లు.. 127 కేజీల బంగారం బయటపడింది. ఆయన దగ్గరా.. ఆయన సన్నిహితుల ఇళ్లలో అధికారులు జరుపుతున్న సోదాలతో బయటపడుతున్న నోట్ల గుట్టల్ని చూసిన వారు షాక్ తింటున్నారు.

టీటీడీ బోర్డు సభ్యునిగా ఎంపిక మొత్తం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నుల్లోనే సాగుతుందన్న విషయం తెలిసిందే. తాజాగా బయటకొచ్చిన సమాచారంతో బాబు వైపు వేలెత్తి చూపించే అవకాశాన్ని ఈ ఉదంతం ఇచ్చింది. టీటీడీ బోర్డు సభ్యుని స్థానంలో తాను నియమించిన వ్యక్తికి సంబంధించిన ఈ భాగోతంపై బాబు వద్ద ప్రశ్నల వర్షం కురిసింది. దానికి ఆయన సింఫుల్ గా బదులిస్తూ.. ఎవరో చెబితే పదవి ఇచ్చాం.. అలా అయిపోతుందని అనుకుంటామా? అన్న మాట రావటం చూస్తే విస్మయానికి గురి కావాల్సిందే. ముఖ్యమైన పదవుల్ని కేటాయించే విషయంలో బాబు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అన్నది ప్రశ్నగా మారుతుంది.

ఎవరో చెబితే..టీటీడీ బోర్డు మెంబరు లాంటి పదవిని ఇచ్చేస్తారా? అన్న సందేహం కలగక మానదు. బాబు మాటల్ని విన్నంతనే అనిపించేదేమిటంటే.. పవర్ చేతిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉంటామని చెప్పే వ్యక్తులు ఎంత బాధ్యతారాహిత్యంతో ఉంటారన్న భావన కలగటం ఖాయం. తన నోటి నుంచి వచ్చే ఈ తరహా మాటలు.. తన ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తాయన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిది.