Begin typing your search above and press return to search.

బాబు ఓదార్పుయాత్ర‌...ఇది జ‌గ‌న్ లాంటిది కాదు

By:  Tupaki Desk   |   1 July 2019 5:35 PM GMT
బాబు ఓదార్పుయాత్ర‌...ఇది జ‌గ‌న్ లాంటిది కాదు
X
ఓదార్పు యాత్ర అంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది వైసీపీ అధినేత‌ - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి. త‌న తండ్రి దివంగత రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి అకాల మ‌ర‌ణంతో అసువులు బాసిన వారిని క‌లుసుకుంటాన‌ని ప్ర‌క‌టించి జ‌గ‌న్ ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇదే రీతిలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సైతం యాత్ర చేయ‌బోతున్నారు. అయితే, ఇది జ‌గ‌న్ లాంటి యాత్ర కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వారి చేతిలో చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించడం. ఈ విష‌యాన్ని తాజాగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నీతి వంతమైన పాలన ఇచ్చామని - మనపై నమ్మకంతోనే 33వేల ఎకరాల భూమిని రైతులు ఇచ్చారన్నారు. 40శాతం ఓట్లను వేసిన ప్రజల కోసం పని చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీ మనుగడకు కార్యకర్తలు చాలా అవసరమని చంద్రబాబు అన్నారు. 37 ఏళ్ళ పాటు పార్టీని - జెండాని మోసింది కార్యకర్తలేనన్న ఆయన… పార్టీ వలన నష్టం వచ్చిన కార్యకర్తలు పార్టీతో ఉన్నారన్నారు. పార్టీకి మూలస్తంభాలు పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయన్న చంద్రబాబు… ఇప్పటి వరకూ ఆరుగురు చనిపోయారన్నారు. ప్రతి కార్యకర్తని కాపాడుకుంటామని పేర్కొంటూ పార్టీ కార్యాల‌యంలోనే ఉంటాను కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసి.. ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలను ఓదార్చటం తన బాధ్యత అని చంద్రబాబు తెలిపారు.

కాగా, చంద్ర‌బాబు నిర్ణ‌యంపై రాజ‌కీయ‌వ‌ర్గాలు ఆస‌క్తిక‌రంగా స్పందిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 నియోజకవర్గాల్లోనే గెలిచింది. ఆ తర్వాత నలుగురు రాజ్యసభ ఎంపీలు సైతం పార్టీని వీడి వెళ్లారు. ఇలాంటి స‌మ‌యం కార్యకర్తల్లో మనోధైర్యం నింపటం కోసం, పార్టీ నేతల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు ఈ యాత్ర ఎంచుకోవ‌డం మంచి నిర్ణ‌యంంటున్నారు. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందని.. అలాంటి కార్యకర్తలను భరోసా ఇవ్వటంతోపాటు చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలనే చంద్రబాబు నిర్ణ‌యం పార్టీ క్యాడ‌ర్‌కు త‌మ పార్టీ తిరిగి పుంజుకోనుంద‌నే భావ‌న క‌లిగిస్తుంద‌ని విశ్లేషిస్తున్నారు.