Begin typing your search above and press return to search.

బాబు గారూ!... అప్ర‌మ‌త్త‌త అంటే ఇదీ!

By:  Tupaki Desk   |   1 May 2019 1:39 PM GMT
బాబు గారూ!... అప్ర‌మ‌త్త‌త అంటే ఇదీ!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌రిగిన నేప‌థ్యంలో ఏపీలో మోడ‌ల్ కోడ్ ఆఫ్ కాండ‌క్ట్ కాస్త గ‌ట్టిగానే ఉంద‌ని చెప్పాలి. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రాగానే... అప్ప‌టిదాకా చ‌క్రం తిప్పిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ స‌ర్కారు ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం అయిపోయింది. అధికారిక స‌మీక్ష‌ల‌కు వీలు లేదు. కొత్త నిర్ణ‌యాల‌కు అస‌లే వీల్లేదు. అయితే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు.. అంటే తుఫాను - వ‌ర‌ద‌లు - తాగు నీటి ఎద్ద‌డి - శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే ప‌రిస్థితుల వంటి స‌మ‌యాల్లో ఎంచ‌క్కా రివ్యూలు చేసుకునే వీలు చంద్ర‌బాబు స‌ర్కారుకు ఇప్ప‌టికీ ఉంద‌నే చెప్పాలి. అలాంటి త‌రుణ‌మే ఇప్పుడు వ‌చ్చింది.

ఫొనీ తుఫాను ముంచుకొచ్చేస్తోంది. ఎక్క‌డో త‌మిళ‌నాడు రాజధాని చెన్నైకి చాలా దూరంగానే కేంద్రీకృత‌మైన ఈ తుఫాను కేంద్రం కార‌ణంగా ఏపీకి పెద్ద‌గా న‌ష్ట‌మైతే లేద‌నే వాదనే వినిపిస్తోంది. అయితే తీర ప్రాంత జిల్లాలు... అది కూడా శ్రీ‌కాకుళం లాంటి జిల్లాల్లో ఓ మోస్త‌రులో ఈ తుఫాను ప్ర‌భావం చూపే అవ‌కాశాలున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ చెబుతోంది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రి కోస‌మో ఎదురు చూడ‌కుండా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం అప్పుడే రంగంలోకి దిగిపోయారు. తుఫానుపై వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించేశారు. జిల్లాల అధికార యంత్రాంగాల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఇంకేముంది... ఇప్పటికే తుఫాను ప్ర‌భావం ఉంటుంద‌ని భావిస్తున్న శ్రీ‌కాకుళం జిల్లాకు బుధ‌వారం మ‌ధ్యాహ్నానికే 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరిపోయాయి. ఇంకో రెండు బృందాలు కూడా దారిలో ఉన్నాయి. ఇదీ అప్ర‌మ‌త్త‌త అంటే.

నిజ‌మే... ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలో అప్ర‌మ‌త్త‌త ఇలానే ఉండాలి. న‌ష్టం జ‌రిగిపోయిన త‌ర్వాత ఏడ‌వ‌టం కాదు... సాంకేతిక ప‌రిజ్ఞానం చేతిలో ఉండ‌గా... ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌తోనే న‌ష్ట నివార‌ణ చేయాలి. మ‌రి చంద్ర‌బాబు చెబుతున్న‌ట్లుగా తాను స‌మీక్ష‌లు చేయ‌కుంటే రాష్ట్రం ఏం కావాలి? అస‌లు చంద్ర‌బాబు స‌మీక్ష‌లు చేసిన కాలంలో ఈ త‌ర‌హా అప్ర‌మ‌త్త‌త క‌నిపించిందా? అంతా మునిగిపోయిన త‌ర్వాత ఎన్డీఆర్ ఎఫ్ బృందాల‌ను రంగంలోకి దించేవారు. బాధితుల‌కు అండ‌గా నిలిచేందుకు అధికారుల‌కు అవ‌కాశం లేకుండా చంద్ర‌బాబు తుఫాను ప్ర‌భావిత ప్రాతాల్లోనే స‌మీక్ష‌లు పెట్టేవారు. మొత్తంగా న‌ష్టం జ‌రిగేదాకా కాళ్లు బార్లా చాపుకుని కూర్చుని ఆ త‌ర్వాత నిద్ర లేచినా... బాధితుల‌ను ఆదుకునే చ‌ర్య‌ల‌కు కాకుండా బాబు ప్ర‌చారానికే స‌మ‌య‌మంతా స‌రిపోయేది. మ‌రి ఇప్పుడో... ప్ర‌జా ప్ర‌భుత్వం లేద‌నో, సీఎం లేర‌నో.. అధికారులు ఊరికే కూర్చోలేరు క‌దా. ముంద‌రి కాళ్ల‌కు బంధాలు లేని ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అధికార యంత్రాంగం న‌ష్టం జ‌రిగిన త‌ర్వాత రంగంలోకి దిగ‌కుండా... న‌ష్ట‌మే జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టేసింది. నిజ‌మైన అప్ర‌మ‌త్త‌త అంటే ఇదే. మ‌రి ఈ విష‌యాన్ని బాబు లాంటి నేత‌లు ఎప్పుడు తెలుసుకుంటారో?