Begin typing your search above and press return to search.

ఏపీలో ఇకపై టీడీపీ (వైఎస్సార్‌) సర్కార్‌!

By:  Tupaki Desk   |   14 April 2016 4:12 AM GMT
ఏపీలో ఇకపై టీడీపీ (వైఎస్సార్‌) సర్కార్‌!
X
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇక మీదట దీనిని తెలుగుదేశం ప్రభుత్వంగా పిలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మొత్తం వాస్తవ రూపం దాల్చేట్లయితే చంద్రబాబునాయుడు కేబినెట్‌ లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించిన వారు చాలా బెర్తులే దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రచారం జరుగుతున్నదంతా నిజమైతే.. చంద్రబాబు కేబినెట్‌ ను చూస్తే.. వైకాపా కేబినెట్‌ ను చూసినట్లే అనిపిస్తుంది తప్ప.. తెదేపా క్యాబినెట్‌ చూసిన భావన కలగకపోవచ్చు.

వివరాల్లోకి వెళితే.. తాజాగా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు.. అభిప్రాయాలు సేకరించడానికి కార్యకర్తలతో ఒక సమావేశం పెట్టుకుని.. తనకు కేబినెట్‌ లో చోటు ఇస్తాం అంటూ చంద్రబాబునాయుడు ఆఫర్‌ చేసినట్లుగా చెప్పుకున్నారుట. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటీవలి కాలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించిన వారిలో ఇప్పటికే జ్యోతుల నెహ్రూ - భూమా నాగిరెడ్డి తదితరులు సీనియారిటీ కోటాలోను - బలవంతులైన నాయకులు అనే కోటాలోనూ తమకు మంత్రి పదవులు గ్యారంటీ అనే ఫీలింగ్‌ తోనే ఉన్నారు.

అదే సమయంలో జలీల్‌ ఖాన్‌ ఏర్పాటుచేసిన ముస్లిం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈసారి మన కేబినెట్‌ లో ముస్లిం మంత్రి కూడా ఉంటారని ప్రకటించి.. ఇండైరక్టుగా జలీల్‌ కు పదవిని ఖరారుచేశారు. అదే సమయంలో వైకాపానుంచి వచ్చిన వారిలో ఒక ఎస్సీ నాయకుడికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారు ఎవరికి వారు తమకు మంత్రి పదవులు వచ్చేస్తాయని అనుకుంటున్నారు. వారిలో కొందరికి ఆ పదవులు కట్టబెట్టినా కూడా.. చంద్రబాబు కేబినెట్‌ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది మొత్తం వైకాపా ఎమ్మెల్యేల మయంగా మారి.. తెదేపా (వైఎస్సార్‌) ప్రభుత్వంగా మారిపోతుందనడంలో సందేహం ఏముందని ప్రజలు అనుకుంటున్నారు.