Begin typing your search above and press return to search.

క‌డ‌ప‌పై ఇంత ప్రేమ ఎందుకు బాబు?

By:  Tupaki Desk   |   7 Jan 2016 6:59 AM GMT
క‌డ‌ప‌పై ఇంత ప్రేమ ఎందుకు బాబు?
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క‌డ‌ప జిల్లాపై ప్ర‌త్యేకమైన ప్రేమ చూపిస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత - వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా అయిన క‌డ‌ప ల‌క్ష్యంగా బాబు చేప‌ట్టిన నిర్ణ‌యం ఇందుకు ప్ర‌త్యక్ష తార్కాణంగా నిలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో విమాన సర్వీసులను పెంచే దిశగా చంద్ర‌బాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్ర‌మంలో ప్రభుత్వం ఇటీవలే సివిల్‌ ఏవియేషన్‌ పాలసీని విడుదల చేసి కొత్త విమానాశ్రయాలను నిర్మించడం, విమానాల రాకపోకలను పెంచడంపై దృష్టి సారించారు. ఈ క్ర‌మంలో మూడు ప్రాంతాలకు కొత్తగా విమానాలు తిప్పేందుకు ముందుకు రావాలని కోరుతూ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అయితే ఈ మూడింటిలో క‌డ‌ప‌కు ప్ర‌త్యేక స్థానం ఉండ‌టం ఆస‌క్తిక‌రం.

రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల్లో ఐదు కేంద్ర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వాటిల్లో ఒక్క కడప తప్ప మిగిలినవి చాలాకాలంగా మనుగడలో ఉన్నాయి. ఇటీవలే కడప విమానాశ్రయాన్ని ప్రారంభించిన నేపథ్యంలో అక్కడికి కూడా విమానాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఉమ్మడి రాజధాని హైద‌రాబాద్‌ కు - కొత్త రాజధానిలోని గన్నవరానికి కడపతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఈ సర్వీసులు తిప్పేందుకు ముందుకొచ్చిన వారికి విమానయాన పాలసీలో భాగంలో ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కడప- హైదరాబాద్‌, కడప- విజయవాడ, తిరుపతి-విజయవాడ మధ్య విమాన సర్వీసుల సంఖ్యకు టెండర్‌ పిలిచారు.ఈనెల 13 లోగా టెండర్లు దాఖలు చేయాలని సూచించింది. కడప నుంచి హైదరాబాద్‌ కు - హైదరాబాద్ నుంచి కడపకు ప్రతి సోమ - మంగళ - శుక్ర - శనివారాల్లో వారం మొత్తంలో ఎనిమిది సర్వీసులు - కడప నుంచి విజయవాడ - విజయవాడ నుంచి కడపకు ప్రతి వారంలో సోమ - బుధ - శుక్రవారాల్లో ఆరు సర్వీసులు, తిరుపతి నుంచి విజయవాడ - విజయవాడ నుంచి తిరుపతికి వారంలో గురువారం నుంచి ఆదివారం వరకు నాలుగు రోజులపాటు ఎనిమిది సర్వీసులు నడిపేలా ముందుకు రావాలని కోరారు.

తాజ‌గా విడుదలైన టెండర్‌ నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన విమానయాన సంస్థలు ఏప్రిల్‌ ఒకటి నుంచి తమ సర్వీసులను ప్రారంభించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌త్యేక ఆస‌క్తితోనే క‌డ‌ప విమానాశ్ర‌యం ప్రారంభించ‌డం మొద‌లుకొని ఈ స‌ర్వీసులు షురూ చేయ‌డం కూడా ఉంద‌ని అంటున్నారు.