Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో అన్న‌కు పెద్ద‌పీట‌

By:  Tupaki Desk   |   1 Nov 2015 6:28 AM GMT
అమ‌రావ‌తిలో అన్న‌కు పెద్ద‌పీట‌
X
న‌వ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శ‌ర‌వేగంగా క‌స‌ర‌త్తు సాగుతున్న స‌మ‌యంలోనే రాజ‌ధాని ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను కూడా దృష్టిలో పెట్టుకొని ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని ప్ర‌భుత్వం ముందడుగు వేస్తోంది. ఈ క్ర‌మంలో పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు నంద‌మూరి తార‌క‌రామారావు స్మ‌ర‌ణ‌కు పెద్ద పీట వేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. అమ‌రావ‌తిలో అన్న క్యాంటిన్ల ఏర్పాటుకు చంద్ర‌బాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌ కు చెందిన అక్షయపాత్ర ఫౌండేషన్‌ కు వంటశాలలను ఏర్పాటు చేసేందుకు మంగళగిరి మండలం ఆత్మకూరులో 2.84 ఎకరాలను లీజు పద్దతిలో అప్పగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎకరాకు ఏడాదికి 50వేల చొప్పున 30 ఏండ్లపాటు లీజుకు కేటాయించి, ప్రతి ఐదేండ్లకొకసారి 10శాతం లీజు పెంచే పద్దతిలో భూమి కేటాయించారు.

ఆత్మకూరులో 2.84 ఎకరాల స్థ‌లంలో తాత్కాలిక ప్రాతిపదికన భారీ వంటశాల నిర్మించుకుని ఇక్కడ నుంచి రాజధాని ప్రాంతానికి, విజయవాడ నగరంలోని పేదలకు తక్కువ ధరకు భోజనం అందించాలని నిర్ణయించారు. ప్లేటు భోజనం రూ.5 చెల్లించేలా ప్రభుత్వం అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆత్మకూరులో నిర్మించే ప్రధాన వంటశాల నుంచి వాహనాలలో గ్రామాలకు మధ్యాహ్న సమయానికి ఆహారం సరఫరా చేస్తారు. మొత్తం లక్ష మందికి భోజనం సరఫరాచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. త‌ద్వారా అమ‌రావ‌తి స‌మీపంలోని అన్నార్తుల ఆక‌లి తీర్చేందుకు, "అన్న‌"ను గుర్తుచేసేందుకు ఏక‌కాలంలో నిర్ణ‌యం తీసుకున్నారు.