Begin typing your search above and press return to search.

క్లీన్ స్వీప్ కోసం చంద్రబాబు ప్లాన్లు

By:  Tupaki Desk   |   13 May 2016 7:19 AM GMT
క్లీన్ స్వీప్ కోసం చంద్రబాబు ప్లాన్లు
X
ఆంధ్రప్రదేశ్‌ లో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తిగా మారబోతున్నాయా? పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. సాఫీగా సాగిపోతాయని అనుకుంటున్న ఈ ఎన్నికల్లో ట్విస్టులు చూడబోతున్నామా? అవుననే అంటున్నాయి వివిధ రాజకీయపక్షాలు. రాజ్యసభ సీట్ల కోసం అధికారపక్షం తెదేపా - విపక్షం వైకాపా బలం చాటుకోవడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రత్యేక హోదా అంశంలో తెదేపా - భాజపాల నడుమ వైరం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి రాజ్యసభకు భాజపా నుంచి ఎవరినైనా ఎంపిక చేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలోని మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలను గెలుచుకునే దిశగా వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. విపక్ష వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకుండా చేయడమే లక్ష్యంగా రాజకీయం సాగుతోందని సమాచారం.

రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ను ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌ - సుజనా చౌదరి పదవీకాలం పూర్తి కాబోతోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జేడీ శీలం - జైరాం రమేష్‌ పదవీకాలం కూడా ముగియనుంది. నామినేటెడ్‌ సభ్యులతో కలిపి రాష్ట్రంలో 176 అసెంబ్లి స్థానాలున్నాయి. వీరందరికీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశముంది. ఈ లెక్కన ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ సీట్లకు ఒక్కొక్కరికి 44 ఓట్లు అవసరం కానున్నాయి. తెలుగుదేశం పార్టీకి సొంతంగా 102 ఎమ్మెల్యేల బలం ఉంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం - ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గాల స్వతంత్ర ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు. దీంతో తెదేపా బలం 104కు చేరింది. మిత్రపక్షమైన భాజపాకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే 17 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు. దీంతో తెదేపా బలం 121కి చేరింది. ఏపీలో వైకాపా బలం 67 కాగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు 17 మంది తెదేపాలో చేరడంతో ఆ పార్టీ బలం 50కి పడిపోయింది. ప్రస్తుతానికి వైకాపా ఒక రాజ్యసభ స్థానానికి పోటీచేసే అవకాశముంది. మరో ఆరుగురు ఎమ్మెల్యేలను తెదేపా ఆకర్షిస్తే నాలుగో రాజ్యసభ సీటును కూడా వైకాపా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. లేని పక్షంలో వైకాపాలో ఉన్న ఎమ్మెల్యేలతో క్రాస్‌ ఓటింగ్‌ జరిపిస్తే తెదేపా నాలుగో రాజ్యసభ సీటును తమ ఖాతాలో వేసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తెదేపా నాలుగో సీటు దక్కించుకోవడానికి సరిపడా వైకాపా ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశాలు లేకున్నప్పటికీ క్రాస్‌ ఓటింగ్‌ జరిగితే ఫలితం తారుమారయ్యే ప్రమాదముందని తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో ఇటువంటి క్రాస్‌ ఓటింగ్‌ లు గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో చోటు చేసుకున్నాయి. సొంత పార్టీ అభ్యర్థిని కాదని ఇతర పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థికి ఓటు వేసిన పరిస్థితి గతంలో అనేకమార్లు జరిగాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రుస్తుత లెక్కల ప్రకారం తాము గెలుచుకునే అవకాశమున్న ఒక్క రాజ్యసభ సీటుపై వైకాపా ధీమాగా ఉంది. మరో సీటు కోసం అభ్యర్థిని నిలబెట్టాలన్న అంశంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. రెండు సీట్లకు అభ్యర్థులను నిలబెట్టి తద్వారా సత్తా చాటాలన్న ధ్యేయంతో జగన్‌ ఉన్నట్టు సమాచారం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్‌ ను జారీచేసి తద్వారా వారిని ఇబ్బందులకు గురిచేయాలని జగన్‌ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే... ఫిరాయింపులు.. అసెంబ్లీలో వ్యవహారాలు ఇలా ప్రతిచోటా అధికార పక్షం చేతిలో దెబ్బ తింటున్న జగన్ ఇప్పడు రాజ్యసభ ఎన్నికల్లోనూ దెబ్బతింటారని రాజకీయపరిశీలకులు అంటున్నారు.