Begin typing your search above and press return to search.

ఏపీలో బదిలీల సందడి

By:  Tupaki Desk   |   3 Sep 2018 12:49 PM GMT
ఏపీలో బదిలీల సందడి
X
ఎన్నికలకు ఏడాది సమయమున్న దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తుకు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లో పాలనాపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్నికలకు ఏడాది ముందే అన్ని స్ధాయిల్లోనూ అధికారుల బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వైఖరినే తాను అవలంభించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ముందస్తుకు వెళ్లడానికి ముందు భారీగా ఐఎఎస్‌ లు - ఐపిఎస్‌ ల బదిలీలు భారీగా చేస్తున్నారు. దీంతో పాటు ఇతర శాఖల్లోని ఉన్నతాధికారులను కూడా ఆయన బదిలీ చేస్తున్నారు. ఆంధ్ర లో కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాలే చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న అధికారుల్లో కొందరి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనంగా ఉన్నారు. అలాగే పార్టీ సీనియర్లు సూచించిన మరి కొంతమంది అధికారుల్లో తమకు కలిసి వచ్చే వారిని కొంతమందికి స్ధాన చలనం కలిగించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ లో కొన్ని జిల్లాల కలెక్టర్లకు - ఎస్పీలకు కూడా స్ధానచలనం ఉంటుందని భావిస్తున్నారు. కలెక్టర్లలో కొందరు మూడేళ్లు పూర్తి చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని మరో జిల్లాకు కాని - సచివాలయంలో పలు కీలక బాధ్యతలకు కాని బదిలీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సమయానికి ఏ కలెక్టర్ కూడా ఒక జిల్లాలో మూడేళ్ల కంటే ఎక్కువ పని చేయకూడదు. ఈ పని చేయడానికి ఎన్నికల కమిషన్ నిబంధనలు అంగీకరించవు. దీనిని ద్రష్టిలో ఉంచుకునే సిఎం చంద్రబాబు నాయుడు కొందరు కలెక్టర్లను తప్పక బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇక జిల్లాల్లో ఉన్న పోలీసు అధికారులపై కూడా ఈ బదిలీ వేటు పడే అవకాశం ఉందంటున్నారు. జిల్లాల్లో పని చేస్తున్న వారిలో ఎస్పీలు - అర్బన్ ఎస్పీల్లో దాదాపు సగం మందిని బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ఉపయోగపడే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారంటున్నారు. కొందరు అధికారుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్న వారి జాబితాను తెలుగుదేశం తమ్ముళ్లు రూపొందిస్తున్నారని సమాచారం. ఇలాంటి వారిపై కచ్చితంగా బదిలీ వేటు పడుతుందని అంటున్నారు. అధికారుల్లో కొందరిని ఇలా బదిలీ చేస్తే మిగిలిన వారికి భయభక్తులు పెరిగి తమకు అనుకూలంగా వ్యవహరిస్తారని తెలుగు తమ్ముళ్లు భాహాటంగానే చెబుతున్నారు.