Begin typing your search above and press return to search.

ప్ర‌తిన‌లోనూ అవే మాట‌లా చంద్ర‌బాబు?

By:  Tupaki Desk   |   2 Jun 2017 8:23 AM GMT
ప్ర‌తిన‌లోనూ అవే మాట‌లా చంద్ర‌బాబు?
X
రాష్ట్రం రెండు ముక్క‌లైన రోజున‌.. వేద‌న‌లో ఉండే ఆంధ్రోళ్ల చేత దీక్ష పేరిట ప్ర‌తిన చేయిస్తాన‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్ప‌టం తెలిసిందే. అన్యాయం జ‌రిగింది మొర్రో.. దానికి న్యాయం చేసే సంగ‌తేదో చూడు బాబు అంటూ జ‌నాలు ఓట్లేసి.. అధికారం అప్ప‌జెపితే.. ఆ ప‌ని వ‌దిలేసి.. రివ‌ర్స్ గేరులో జ‌నాల చేత‌నే ప్ర‌తిన చేయిస్తాన‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్ప‌టం క‌నిపిస్తుంది.

ప్ర‌జ‌ల ప్రమేయం లేకున్నా.. వారి ఇష్టానికి.. అభిమ‌తానికి విరుద్ధంగా జ‌రిగిన విభ‌జ‌న ఎపిసోడ్ లో రాజ‌కీయ నాయ‌కులంతా బాధ్యులే. ఇప్పుడిన్ని మాట‌లు చెబుతున్న చంద్ర‌బాబు కూడా విభ‌జ‌న‌కు కార‌కుడేన‌న్న విష‌యాన్ని అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు. ఎలా అంటారా?. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు త‌మ పార్టీ సానుకూలం అంటూ లేఖ ఇచ్చిన త‌ర్వాతే తెలంగాణ‌రాష్ట్ర ఏర్పాటు మీద కీల‌క పావులు క‌దిలాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

విభ‌జ‌న‌లో తొలి అడుగు త‌న‌దేన‌న్న విష‌యాన్ని వ‌దిలేసి.. విభ‌జ‌న కార‌ణంగా ఆంధ్రోళ్ల‌కు చాలా అన్యాయం జ‌రిగింద‌ని.. ఇప్ప‌టికి తాను ఆ బాధ‌ను మ‌ర్చిపోలేక‌పోతున్న‌ట్లుగా బాబు చెబుతారు. ఇక్క‌డ ఒకే ఒక్క సూటిప్ర‌శ్న‌ను బాబును అడగాల‌నిపిస్తుంది. విభ‌జ‌న‌కు లేఖ ఇచ్చేసిన త‌ర్వాత‌.. విభ‌జ‌న నిర్ణ‌యాన్ని కేంద్రం తీసుకున్న‌ప్పుడు ఏపీకి ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా ఉండ‌టానికి బాబు త‌యారు చేసుకున్న ప్లాన్ ఏమిటి? ఒక‌వేళ త‌యారు చేసుకుంటే.. విభ‌జ‌న స‌మ‌యంలో బాబు దాన్ని ఎందుకు బ‌య‌ట‌కు తీయ‌లేదు? లాంటి ప్ర‌శ్న‌లు వేసుకుంటూ వెళితే చాలానే వ‌స్తాయి.

జ‌నాలు మ‌ర్చిపోతార‌ని అనుకుంటారో.. ఎదురుప‌డి.. నిల‌దీసి అడ‌గ‌లేర‌న్న న‌మ్మ‌క‌మేమో కానీ.. ఇలాంటి సందేహాల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ చంద్ర‌బాబు స‌మాధానం చెప్ప‌లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూదు. విభ‌జ‌న గాయం గుర్తుకు వ‌చ్చేలా ఉండే జూన్ 2ను.. న‌వ నిర్మాణ దీక్ష పేరుతో కార్య‌క్ర‌మాలు చేసి.. మ‌ళ్లీ మ‌ళ్లీ కెల‌కటం బాబుకు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి.

ఇంతా చేసి కోట్లాది మంది ప్ర‌జ‌ల చేత చేయిస్తాన‌ని చెప్పే ప్ర‌తిన‌లో బ్ర‌హ్మాండం బ‌ద్ధ‌ల‌య్యే అంశాలు ఉన్నాయా? అన్న‌ది చూస్తే..అలాంటిదేమీ ఉన్న‌ట్లు క‌నిపించ‌దు. నిజానికి విభ‌జ‌న కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని భ‌ర్తీ చేయాల్సింది రాజ‌కీయ పార్టీలు.. రాజ‌కీయ నేత‌లే త‌ప్పించి.. ప్ర‌జ‌లు ఎంత‌మాత్రం కాద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఏ ప్రాంతానికి చెందిన ప్ర‌జ‌లు సైతం సుఖాల నుంచి క‌ష్టాల్లోకి వెళ్లాల‌ని కోరుకోరు. అలా కోరుకునే వారుఎవ‌రైనా ఉన్నారంటే అది రాజ‌కీయ ప‌క్షాలు మాత్ర‌మే.

ఎందుకంటే.. క‌ష్టాలే.. వారి అధికారానికి అవ‌కాశాలుగా మార‌తాయ‌ని మ‌ర్చిపోకూడ‌దు. ఇదిలా ఉంటే.. బాబు చేయించే ప్ర‌తిన చూస్తే.. నిత్యం ఆయ‌న చెప్పే మాట‌లే ఉంటాయి. ఇక‌.. ప్ర‌తిన‌లో అవినీతి అన్న‌ది లేకుండా అన్న ప్ర‌స్తావ‌న ఉంది. మిగిలిన‌విష‌యాల్ని వ‌దిలేసినా.. ఆ ఒక్క దాని విష‌యంలో అయినా బాబు స‌ర్కారు నిజాయితీగా ప‌ని చేస్తుందా? అన్న ప్ర‌శ్న‌.. బాబు ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న గుండెల మీద చేయి వేసుకొని ఆలోచిస్తే.. ఈ ప్ర‌తిన‌ను కోట్లాది మందితో చేయించ‌రేమో? ఇంత‌కీ బాబు చేయించే ప్ర‌తిన‌ను చూస్తే..

అవినీతి.. కుట్ర రాజ‌కీయాల వ‌ల్ల రాష్ట్రానికి జ‌రిగిన న‌ష్టాన్ని మ‌న క‌ష్టంతో పూరించ‌టానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వ‌ర్ణాంధ్ర‌ప్ర‌దేశ్ నిర్మాణంలో అలుపెరుగ‌ని శ్ర‌మ‌జీవులం మ‌నము. ప్ర‌తి సంక్షోభాన్నీ ఒక అవ‌కాశంగా మ‌లచుకుందాము. దేశ‌భ‌క్తితో.. సామాజిక బాధ్య‌త‌తో.. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మ‌న రాష్ట్ర ప్ర‌గతి కోసం.. శ్రేయ‌స్సు కోసం మ‌నంద‌రం భుజం భుజం క‌లిపి ప‌ని చేద్దాము. 2022నాటికి మ‌న రాష్ట్రాన్ని దేశంలో మూడు అగ్ర‌గామి రాష్ట్రాల్లో ఒక‌టిగా.. 2029 నాటికి దేశంలోనే అత్యుత్త‌మ‌మైన రాష్ట్రంగా.. 2050 నాటికి ప్ర‌పంచంలో అత్యున్న‌త ప్ర‌మాణాలు క‌లిగిన రాష్ట్రంగా తీర్చిదిద్ద‌డ‌మే ప‌విత్ర ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నాము. అవినీతి లేని.. ఆర్థిక అస‌మాన‌త‌లు లేని.. అంద‌రికి ఉపాధి క‌ల్పించే ఆరోగ్య‌క‌ర‌మైన‌.. ఆనంద‌మ‌యమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాము. ఈ ల‌క్ష్య సాధ‌న‌కు స‌మ‌ర్ప‌ణ భావంతో.. నిష్ఠ‌తో.. త్రిక‌ర‌ణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ‌నిర్మాణ దీక్షా ల‌క్ష్యాల‌ను సాధిద్దాము. జై జ‌న్మ‌భూమి.. జైహింద్‌

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/