Begin typing your search above and press return to search.

చంద్రబాబు తీర్మానం..ఎలా నమ్మాలి?

By:  Tupaki Desk   |   29 May 2020 2:30 AM GMT
చంద్రబాబు తీర్మానం..ఎలా నమ్మాలి?
X
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మహానాడు వేదికపై నుంచి సంచలన తీర్మానం చేశారు. ఇకపై జంప్ జిలానీలకు తమ పార్టీలోకి ప్రవేశం లేదనేశారు. అధికార దాహంతో తెలుగుదేశంను వీడిన ఎవ్వరినీ తిరిగి పార్టీలోకి తీసుకోబోమనేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఒక ప్రధాన పార్టీ అధినేత ఇలాంటి ప్రకటన చేయడం.. తీర్మానాన్ని ప్రకటించడం సంచలనం అనే చెప్పాలి. కానీ ఈ తీర్మానానికి చంద్రబాబు అండ్ కో ఏమేర కట్టుబడతారన్నదే సందేహం. ఎందుకంటే అధికారంలో ఉన్నపుడు ఆయన కూడా ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన వారే. 2014-19 మధ్య ఏపీలో చంద్రబాబు సర్కారు అధికారంలో ఉండగా 20 మందికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వారిలో కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఇంకా ఎంతోమంది వైకాపా వాళ్లను తెలుగుదేశంలోకి చేర్చుకున్నారు.

ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. కాకపోతే తెలుగుదేశంతో పోలిస్తే ఈ విషయంలో కొంచెం మెరుగనే చెప్పాలి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అధికారికంగా వైకాపా కండువా కప్పుకోవట్లేదు. తమ పార్టీ వైకాపా అని చెప్పుకోవట్లేదు. వల్లభనేని వంశీ లాంటి వాళ్లు వైకాపా తీర్థం పుచ్చుకోకుండానే ఆ పార్టీ మద్దతుదారులుగా మారిపోయారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మరింతమంది తెదేపా ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నాడు జగన్. అధికారంలోకి రాగానే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచిన వాళ్లనే తమ పార్టీలో చేర్చుకుంటామని.. ఫిరాయింపుల్ని ప్రోత్సహించమని జగన్ ప్రకటన చేయడంతో ఆ మాటకు కట్టుబడాల్సి వస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ తాజా తీర్మానం విషయానికి వస్తే.. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి జగన్ సర్కారుపై వ్యతిరేకత ఉండి - తెలుగుదేశానికి విజయావకాశాలు కనిపిస్తే పెద్ద ఎత్తున నేతలు వైకాపా నుంచి తెదేపాలోకి జంప్ చేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత తీర్మానానికి కట్టుబడి చంద్రబాబు వాళ్లందరికీ గేట్లు మూసేస్తారా.. ఒకవేళ మళ్లీ అధికారంలోకి వస్తే ఇలాగే ఫిరాయింపులకు దూరంగా ఉంటారా అన్నది ప్రశ్న.