Begin typing your search above and press return to search.

పాతికేళ్ళుగా లొంగని సీటు మీద బాబు మార్క్ మంత్రాంగం

By:  Tupaki Desk   |   2 Nov 2022 4:25 AM GMT
పాతికేళ్ళుగా లొంగని సీటు మీద బాబు మార్క్  మంత్రాంగం
X
ఆ సీటు తెలుగుదేశాన్ని ఊరిస్తోంది. రాజకీయంగా ఆశలు రేపుతూ ఎపుడూ చివరి నిమిషంలో చేజారుతోంది. ఆ సీటే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ఎంపీ సీటు. టీడీపీని ఏ విధంగానూ లొంగను అంటోంది ఈ సీటు. టీడీపీ ఏర్పాటు అయ్యాక పదికి పైగా ఎంపీ ఎన్నికలు జరిగితే కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే ఈ సీట్లో ఆ పార్టీ గెలిచింది. అది కూడా 1984లో బెజవాడ పాపిరెడ్డి గెలిస్తే 1999లో కరణం బలరామక్రిష్ణమూర్తి గెలిచారు. ఇక ఇప్పటికి పాతికేళ్ళుగా మళ్లీ అక్కడ బోణీ కొట్టలేదు.

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ తో హోరాహోరీ పోరు సాగుతున్నపుడు కచ్చితంగా ఒంగోలు సీటు ఆ పార్టీయే గెలుచుకునేది. విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో ఆ సీటుని వైసీపీ గెలుచుకుంది. 2014లో జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఈ సీట్లో గెలిస్తే 2019 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలిచారు. రెండు సార్లూ టీడీపీ ఓడిపోయింది. 2014లో మాగుంట టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చవి చూస్తే 2019 ఎన్నికల్లో అప్పటి టీడీపీ మంత్రి శిద్ధా రాఘవరావు ఎంపీగా చివరి నిముషంలో బరిలోకి దిగారు.

అప్పటికే వైసీపీ మంచి ఊపు మీద ఉంది. పైగా జగన్ వేవ్ ఉంది. దాంతో ఏకంగా రెండున్నర లక్షల ఓట్ల తేడాతో ఈ సీటుని వైసీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో ఒంగోలు సీటుని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకుని తీరాలని టీడీపీ పంతం పడుతోంది. దీని మీద చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు అని చెబుతున్నారు. ఇక ఒంగోలు పార్లమెంట్ సీటు పరిధిలో కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి, కొండెపి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

చంద్రబాబు వరసగా చేస్తున్న సమీక్షలలో ఈ సీట్లలో టీడీపీ బాగా పుంజుకుంటోంది. దాంతో ఒంగోలు ఎంపీ సీటు మీద కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే టీడీపీకి ఉన్న ఇబ్బంది ఏంటి అంటే బలమైన అభ్యర్ధి లేకపోవడం. అన్ని రకాలుగా తట్టుకునే అభ్యర్ధి కనుక ఉంటే ఆయన గెలుపుతో పాటు ఆ ప్రభావం అసెంబ్లీ సీట్ల మీద కూడా పడి టోటల్ గా విజయం టీడీపీది అవుతుంది అన్నది చంద్రబాబు ఆలోచన.

దాంతో ఆయన బలమైన అభ్యర్ధిగా ఆయన మార్కాపురానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తూమాటి వెంకటనరసింహారెడ్డిని బరిలోకి దింపడానికి పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఈయన అంగబలం అర్ధబలం ఉన్న నాయకుడు. పైగా వైసీపీ నుంచి కూడా రెడ్డి సామాజికవర్గం అభ్యర్ధి ఎంపీగా బరిలో ఉంటారు.

దాంతో సామాజికవర్గం పరంగా వైసీపీ నుంచి ఓట్ల చీలికతో పాటు రాజకీయంగా ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటూ టీడీపీకి మేలు చేకూరుస్తారని భావిస్తున్నారు. ఈ విషయంలో తూమాటి ఇంకా ఎస్ అని చెప్పలేదని అంటున్నారు. చంద్రబాబు కనుక ఆయన మీద వత్తిడి పెడితే కచ్చితంగా ఓకే అని బరిలోకి దిగడం ఖాయం. అదే జరిగితే ఒంగోలు ఎంపీ సీటులో పోరు వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.