Begin typing your search above and press return to search.

ఎల్వీ అడుగు వెన‌క్కి.. బాబు కూడా త‌గ్గారు

By:  Tupaki Desk   |   8 May 2019 4:54 AM GMT
ఎల్వీ అడుగు వెన‌క్కి.. బాబు కూడా త‌గ్గారు
X
నువ్వెంత‌? అంటే నువ్వెంత అనే రోజులివి. ఎదుటోడ్ని గౌర‌వించే వైనం త‌గ్గి చాలానే రోజులైంది. ఇలాంటివేళ‌లో ప్ర‌భుత్వానికి పెద్ద అయిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి.. రాష్ట్ర ర‌థ‌సార‌ధి ముఖ్య‌మంత్రి మ‌ధ్య ప్ర‌చ్చ‌న్న‌యుద్ధం మొద‌లైతే ఎలా ఉంటుంద‌న్న విష‌యంలో గ‌డిచిన కొద్దిరోజులుగా ఏపీలో చోటు చేసుకున్న ప‌రిణామాల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు.

వీరి మ‌ధ్య వివాదం అంత‌కంత‌కూ పెరిగి.. నువ్వెంత అంటే నువ్వెంత‌? అనే వ‌ర‌కూ వెళ్లిన ప‌రిస్థితి. వాస్త‌వంగా చూస్తే.. ముఖ్య‌మంత్రికి తిరుగులేని అధికారాలుంటాయి. అయితే.. ప‌ద‌వీకాలం ముగిసే వేళ‌.. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న స‌మ‌యంలో సీఎం చుట్టూ ప‌రిమితులు వ‌చ్చి చేర‌టంతో ఆయ‌న ప‌రిధి త‌గ్గిపోయే ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణితో ఇబ్బందులు రావు. అందుకు భిన్నంగా ముఖ్య‌మంత్రి.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శులు ఉత్త‌ర ద‌క్షిణ ధ్రువాలుగా ఉన్న‌ప్పుడే కొత్త ఆట మొద‌ల‌వుతుంది.

స‌రిగ్గా ఇలాంటిదే ఏపీలో నెల‌కొంది. త‌న అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి వీలుగా మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని నిర్వ‌హించేందుకు ముఖ్య‌మంత్రి డిసైడ్ అయ్యారు. ఇలాంటివేళ‌లో కేబినెట్ స‌మావేశానికి బ్రేకులు వేసేందుకు ఎల్వీ సిద్ధ‌మ‌య్యారు. ఇలాంటివేళ‌.. అన‌వ‌స‌ర‌ ఉద్రిక్త‌త‌లు పెంచే విష‌య‌మై అందిన స‌ల‌హాల పుణ్య‌మో.. మ‌రేదైనా కార‌ణ‌మో కానీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్న ఎల్వీ ఒక అడుగు వెన‌క్కి వేశారు.

అలా అని.. పూర్తిగా రాజీ ప‌డ‌నిట్లుగా వ్య‌వ‌హ‌రించ‌కుండా రూల్ బుక్ ను తెరపైకి తీసుకొచ్చి బాబు స్పీడ్ కు బ్రేకులు వేశార‌ని చెప్పాలి. ప్ర‌భుత్వానికి బాస్ సీఎమ్మేన‌ని చెప్ప‌టం ద్వారా ఆయ‌న అధిక్య‌త‌ను ఒప్పుకుంటూనే.. తాజాగా నెల‌కొన్న ఎన్నిక‌ల కోడ్ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌టం ద్వారా సంధికి సై చెప్పేశారు ఎల్వీ.

ఘ‌ర్ష‌ణకు పెద్దగా ఇష్ట‌ప‌డ‌ని బాబు.. వెంట‌నే ఎల్వీ ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించేలా నిర్ణ‌యాలు తీసుకున్నారు. తాను త‌లపెట్టిన కేబినెట్ ను ముందుగా అనుకున్న తేదీకి కాకుండా వాయిదా వేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పేర్కొన్న‌ట్లుగా.. కేబినెట్ స‌మావేశానికి ఎన్నిక‌ల సంఘం నుంచి అనుమ‌తి తీసుకోవాల‌న్న రూల్ కు ఓకే చెప్ప‌టంతో వివాదం స‌మిసిపోన‌ట్లైంది.

మంత్రివ‌ర్గ స‌మావేశానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అని.. రెండు రోజుల ముందే ఈసీజేకి స‌మాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంద‌ని చెప్ప‌టంతో.. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం అందుకు త‌గిన‌ట్లే వ్య‌వ‌హ‌రించింది. ఫోని తుఫాను.. రాష్ట్రంలో క‌ర‌వు ప‌రిస్థితుల‌తో పాటు నీటి ఎద్ద‌డి.. ఉపాధి హామీ కూలీల‌కు చెల్లించాల్సిన అంశాల‌కు ఎజెండా నోట్ లో పేర్కొంది. దీన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపుతూ సీఎస్ నిర్ణ‌యం తీసుకోవ‌టంతో ప‌దో తేదీన జ‌ర‌గాల్సిన కేబినెట్ భేటీ.. ఈ నెల ప‌ద్నాలుకు వాయిదా ప‌డింది. అయితే.. దీనికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి ల‌భించిన త‌ర్వాత‌నే నిర్వ‌హించ‌నున్నారు. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో సీఎం.. సీఎస్ ల మ‌ధ్య నెల‌కొన్న ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.