Begin typing your search above and press return to search.

దసరా మంత్రులకు ఆశాభంగం!!

By:  Tupaki Desk   |   23 Sep 2016 11:03 AM GMT
దసరా మంత్రులకు ఆశాభంగం!!
X
ఏపీలో మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడుతోందా అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ముందుగా అనుకున్నట్లుగా దసరాకు ముందు మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని తెలుస్తోంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పుల ముహూర్తంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడులో పునరాలోచన చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది.

ముఖ్యంగా పురపాలక ఎన్నికలు ఉండడంతో అవి పూర్తయిన తరువాతే విస్తరణ జరపాలని భావిస్తున్నట్లుగా సమాచారం. నవంబర్‌ లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. 11 మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల్లో ఆరు కార్పొరేషన్లు - ఐదు పురపాలికలున్నాయి. అన్నింటిలోనూ గెలవటం అధికార పార్టీకి అత్యంత ప్రతిష్టాకరం. ఈ నేపధ్యంలో నవంబర్‌ లో ఎన్నికలు పెట్టుకుని, ఒక నెల ముందుగా అంటే అక్టోబర్ నెలలో మంత్రి వర్గ విస్తరణ లేదా ప్రక్షాళన చేస్తే దాని ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై పడుతుందని సిఎంలో ఆందోళన మొదలైనట్లు సమాచారం. కాబట్టి, మంత్రివర్గం విషయం నవంబర్‌ లో ఎన్నికలైపోయిన తర్వాత అంటే డిసెంబర్ నెలలో చూసుకోవచ్చని చంద్రబాబు తాజాగా యోచిస్తున్నట్లు సమాచారం.

అయితే, దసరా సందర్భంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోయినా ఒక్క లోకేశ్ విషయంలో మాత్రం మినహాయింపు ఉండొచ్చని ఆయన్ను దసరా ముందే చేర్చుకోవచ్చని అనుకుంటున్నారు. లోకేశ్ కోసం ముహూర్తం ముందే సిద్ధం చేశారని.. దాని ప్రకారం ఆయన ఒక్కరినే చేర్చి మిగతా విస్తరణ డిసెంబరులో పెట్టుకునే అవకాశాలూ ఉన్నాయంటున్నారు.