Begin typing your search above and press return to search.

ఏపీలో సంక్రాంతి త‌ర్వాతే తేల్చుకుంటార‌ట‌!

By:  Tupaki Desk   |   2 Oct 2016 9:32 AM GMT
ఏపీలో సంక్రాంతి త‌ర్వాతే తేల్చుకుంటార‌ట‌!
X
ఆంధ్రప్రదేశ్‌ లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల పోరు కోసం వేచి చూస్తున్న వారికి మ‌రికొంత కాలం నిరీక్ష‌ణ త‌ప్పేలా లేదు. అధికార టీడీపీ అధినేత - సీఎం చంద్రబాబు నాయుడు నేతలకు స్పష్టత ఇచ్చిన ప్ర‌కారం స్థానిక సంస్థలకు సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. బహుశా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్-జనవరిలోనే ఎన్నికలు జరిపించేందుకు ముఖ్యమంత్రి సిద్ధం కాగా - సీనియర్లు - కొందరు మంత్రులు సంక్రాంతి పండుగ తర్వాత పెడితే బాగుంటుందని సూచించడంతో బాబు అంగీకరించారు. దీంతో ఆయా రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న బ‌లాబలాల స‌త్తా సంక్రాంతి స‌మ‌యంలో తేల‌నుంది.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంటే సుమారు రెండున్న‌ర‌ల సంవ‌త్స‌రాల త‌ర్వాత జ‌ర‌గ‌నున్న‌ కార్పొరేషన్ - మునిసిపల్ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత 7 కార్పొరేషన్లు - 4 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ప్రకారంగా విశాఖ - గుంటూరు - శ్రీకాకుళం - కర్నూలు - తిరుపతి - కాకినాడ - ఒంగోలు కార్పొరేషన్లు - రాజంపేట - రాజాం - కందుకూరు - నెల్లిమర్ల మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలుచుకోవాల‌ని భావించిన టీడీపీ అధిష్టానం కొద్దికాలం నుంచే ఆయా కార్పొరేషన్లు - మునిసిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈపాటికే వాటిపై సమీక్షలు ప్రారంభించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కుల సమీకరణలు - ప్రత్యర్ధి పార్టీల బలాబలాపై కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా - సీనియర్లతోపాటు - యువనేతలనూ అక్కడ ఇంచార్జిలుగా నియమించాలని భావిస్తున్నారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో సమన్వయంతో వెళ్లాలని, తాను ఆ ఫలితాలు సీరియస్‌ గా తీసుకుంటానని హెచ్చరించారంటే, బాబు స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించారని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ గెలిస్తే మరో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు - అంతకంటే ముందు జరిగే జడ్పీ - పంచాయతీ - మున్సిపల్ ఎన్నికలపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఒకవేళ ఆశించిన ఫలితాలు రాకపోతే అధికార పార్టీ కష్టాల్లో పడక తప్పదు. రెండేళ్లకు ముందే వ్యతిరేక సంకేతాలు వెళితే - అది కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. అందుకే తెదేపా నాయకత్వం తక్కువ స్థానాలయినా ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోంది. కాగా, ఎన్నికలు జరిగే జిల్లాల్లో మాట వినని కలెక్టర్లు - కమిషనర్లను బదిలీ చేసేందుకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారు కొనసాగితే ఆశించిన ఫలితాలు రావని ఎమ్మెల్యేలు - మంత్రులు పార్టీ నాయకత్వానికి సూచించగా, అందుకు సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. కడప - గుంటూరు - చిత్తూరు - ప్రకాశం కలెక్టర్లను మార్చవచ్చన్న ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ పై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు ఎస్పీలను కూడా బదిలీ చేసే అవకాశం ఉందంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/