Begin typing your search above and press return to search.

భూములిచ్చిన రైతులకు పాదాభివందనం

By:  Tupaki Desk   |   22 Oct 2015 8:47 AM GMT
భూములిచ్చిన రైతులకు పాదాభివందనం
X
అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు నుంచి మట్టిని, యమునా నది నుంచి జలాన్ని సేకరించి తీసుకురావడమనేది ఆయన మనకు మద్దతుగా ఉన్నారనడానికి నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. వారిని అందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను’’ అని చంద్రబాబునాయుడు అన్నారు. కొన్ని రాజకీయ పర్టీలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని విమర్శించారు.

రెండు రాష్ట్రాలుగా విడిపోయిన కారణంగా తలెత్తుతున్న సమస్యలను కేసీఆర్ తో కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటామని వెల్లడించారు. చంద్రబాబు అలా అంటున్న సమయంలో్ వేదికపై ఉన్న కేసీఆర్ సానుకూలమైన హావభావాలు కనబరచడం విశేషం.

ప్రజా రాజధానిలో ప్రజా భాగస్వామ్యం కోసం మన నీరు, మనమట్టి మన అమరావతి అంటూ పిలుపు నివ్వగానే మొత్తం రాష్ట్రం, దేశం కులమతాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక పవిత్ర కార్యంగా దీనిని విజయవంతం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాల నుంచీ దర్గాల నుంచీ, మసీదులనుంచీ, చర్చిల నుంచీ కూడా మట్టి, నీరు తీసుకువచ్చామని చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే మహాపురుషుల జన్మ స్థలాల నుంచి కూడా పుట్ట మన్ను, జలాలు తీసుకువచ్చామన్నారు. అలా తీసుకువచ్చిన మట్టి జలాలను ఈ ప్రాంతంలో చల్లి ఆ ప్రాంతాలను మన రాజధానితో అనుసంధానం చేశామన్నారు. దీంతో ప్రపంచంలోకెల్లా వక్తివంతమైన నేలగా అమరావతి మారిపోయిందని చంద్రబాబు అన్నారు.

అమరావతి శంకుస్థాపనకు 33 పవిత్ర నదుల నుంచి జలాలు తీసుకుని వచ్చినట్లు ఏపీ సిఎం చంద్రబాబు తెలిపారు. కృష్ణా, గోదావరి తదితర నదుల నుంచి మానససరోవరం, కాశీ, పూరి, మక్కా మసీదు, దర్గా, అలాగే పలు విశిష్ఠ క్షే త్రాలనుంచి మట్టి తీసుకుని వచ్చామన్నారు.ఈశాన్యంలో నీటి ప్రవాహం వాస్తవంగా ఎంతో విశిష్టంగా ఉంటుందన్నారు. అమరావతిలో 9 నగరాలు ఉంటాయన్నారు.