Begin typing your search above and press return to search.

ఏం పొగిడేశావ్.. చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   20 Aug 2015 10:25 AM GMT
ఏం పొగిడేశావ్.. చంద్ర‌బాబు
X
కాలం క‌లిసి రాన‌ప్పుడు కాస్త త‌గ్గి ఉండ‌టానికి మించింది లేదు. రాజ‌కీయంగా డ‌క్కామొక్కీలు తిన్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఇలాంటి విష‌యాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అదిలించి.. బెదిరించి అనుకున్న ప‌నులు చేయించుకోవ‌టానికి ప్ర‌ధాని స్థానంలో వాజ్ పేయ్ లేర‌ని.. న‌రేంద్ర మోడీ ఉన్నార‌న్న విష‌యం బాబుకు నిత్యం గుర్తుండే ఉంటుంది.

అందుకే.. ఆయ‌న పోరాటం జోలికి పోకుండా.. వీలైనంతగా త‌గ్గి ఉంటున్నారు. న్యాయ‌మైన కోర్కెల్ని సైతం నిల‌దీసి సాధించుకునే క‌న్నా.. ప్రేమ‌తో పొగిడేసిన ప‌ని పూర్తి చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా.. ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలో ప్ర‌ధాని మోడీ ముందుకెళ్లి మాట్లాడి ప‌ని పూర్తి చేసుకొస్తాన‌ని న‌మ్మ‌కంగా చెప్పే చంద్ర‌బాబు.. గురువారం తాడేప‌ల్లిగూడెంలోని నిట్ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కేంద్ర‌మంత్రులు వెంక‌య్య‌నాయుడు.. స్మృతి ఇరానీల ప‌ట్ల త‌న‌కు అభిమానాన్ని చేత‌ల్లోనూ.. మాట‌ల్లోనూ ప్ర‌ద‌ర్శిస్తూ వారిని సంతృప్తి ప‌రిచేందుకు తెగ ప్ర‌య‌త్నించారు.

ఇందులో భాగంగా కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడ్నివిప‌రీతంగా పొగిడేశారు. లోక్‌స‌భ‌లో విభ‌జ‌న చ‌ట్టాన్ని ఆమోదించే స‌మ‌యంలో పార్ల‌మెంటు త‌లుపులు మూసేసి.. టీవీలు ఆపు చేసి..లైవ్ లు క‌ట్ చేసి మ‌రీ బిల్లు ఆమోదించార‌న్నారు. ఇలా బిల్లును ఆమోదించిన తీరు త‌న‌కు బాధ క‌లిగించింద‌న్నారు.

అయితే.. ఇదే బిల్లు రాజ్య‌స‌భ‌కు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం వెంక‌య్య‌నాయుడు అభిమ‌న్యుడి మాదిరి ప్ర‌య‌త్నించి ఏపీకి అన్యాయం జ‌ర‌గ‌కుండా చూశార‌న్నారు. ప్ర‌త్యేక‌హోదాకు సంబంధించిన హామీ వెంక‌య్య అదే రీతిలో తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. అయితే.. అలా నోటి మాట‌గా వ‌చ్చిన ప్ర‌త్యేక‌హోదా హామీకి ఎలాంటి చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేద‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు మ‌ర్చిపోయినట్లు క‌నిపిస్తోంది. మొత్తమ్మీదా వెంక‌య్య‌ను శూరుడు.. ధీరుడు.. అభిమ‌న్యుడు అని పొగిడేసి.. ఆయ‌న‌కు సంతోషం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌టంలో చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రాజ‌కీయ నాయ‌కులు అనుకోవాలే కానీ ఒక వైపు తిడుతూనే.. మ‌రోవైపు పొగిడేయ‌గ‌ల‌రు. అలాంటిది అవ‌స‌రం ఎంతో ఉన్న వెంక‌య్య‌ను చంద్ర‌బాబు ఆ మాత్రం పొగ‌డ‌కుండా ఉంటారా..?